Begin typing your search above and press return to search.

మ‌ట్ట‌గిడ‌స‌లా జారిపోతాడ‌ని చిరుని వ‌లేసి ప‌ట్టారు!

By:  Tupaki Desk   |   2 Oct 2022 6:30 AM GMT
మ‌ట్ట‌గిడ‌స‌లా జారిపోతాడ‌ని చిరుని వ‌లేసి ప‌ట్టారు!
X
మెగాస్టార్ చిరంజీవి - సురేఖ జంట వివాహం ఎలా జ‌రిగింది? పెళ్లి చూపుల తంతు ఎలా సాగింది? పెళ్లికి ముందు చిరు మామ గారి నుంచి ఎలాంటి టెస్టింగులు ఫేస్ చేసారు? అనేదానికి ఇన్నాళ్లుగా పూర్తిగా అభిమానుల‌కు తెలిసింది త‌క్కువే. కానీ ఇటీవ‌ల అల్లూ స్టూడియోస్ లాంచ్ వేడుక‌లో మెగాస్టార్ స్వ‌యంగా ఆ గుట్టు కాస్తా విప్పారు. త‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌కు బోలెడ‌న్ని టెస్టులు పెట్టాకే అల్లు కుటుంబం పిల్ల‌నిచ్చింద‌న్న అస‌లు ర‌హ‌స్యాన్ని ఆయ‌న విడ‌మ‌ర్చి చెప్పిన తీరు క‌డుపుబ్బా న‌వ్వించింది.

నిజానికి చిరంజీవి కెరీర్ ఆరంభ‌మే మేటి న‌టుడు సీనియ‌ర్ అయిన అల్లు రామ‌లింగ‌య్య గారితో క‌లిసి న‌టించారు. అదే క్ర‌మంలో ఈ కుర్రాడు ఎవ‌రు? అంటూ రామ‌లింగ‌య్య గారు ప‌దే ప‌దే చిరుని త‌ర‌చి చూసేవార‌ట‌. కొన్ని సీన్స్ లో న‌టించేప్పుడు చిరు ఇన్వాల్వ్ మెంట్ ని గ్రేస్ ని అన్నిటినీ ప‌సిగ‌ట్టేసారు. ఈ కుర్రాడికి చాలా భ‌విష్య‌త్ ఉంద‌ని కూడా అల్లు రామ‌లింగ‌య్య‌- అల్లు అర‌వింద్ ఇద్ద‌రూ ప‌సిగట్టేసార‌ట‌. అంతేకాదు హీరోయిన్ తో అత‌డు ప్ర‌వ‌ర్తించే తీరును గ‌మ‌నించారు. అంద‌రు కుర్ర‌హీరోలు హీరోయిన్లు అమ్మాయిల‌తో మాట్లాడుతూ ఉంటే చిరు మాత్రం గుర్ర‌పు స్వారీ నేర్చుకునేందుకు వెళ్లిపోయేవార‌ట‌. ఇవ‌న్నీ అల్లూ రామ‌లింగ‌య్య‌- అర‌వింద్ గ‌మ‌నించేవారు. చిరు ఎప్పుడూ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో న‌ట‌న‌పైనే దృష్టి సారించి త‌న ప‌ని తాను చేసుకుపోయేవారు. పైగా క‌మ‌ల్ హాస‌న్ లాంటి అంద‌గాడు ఉన్న ప‌రిశ్ర‌మ‌లో మ‌రో అంద‌గాడు షార్ప్ ఉన్న కుర్రాడు అంటూ చిరును ప‌సిగ‌ట్టిన తొలి మొన‌గాళ్లు అల్లు వారే!

ఇంకేం ఉంది.. అలా ప‌సిగ‌ట్టాక నెమ్మ‌దిగా చిరు వ‌ద్ద పెళ్లి ప్ర‌స్థావ‌న తెచ్చారు. ఇంత‌కీ ఎవ‌ర‌బ్బాయివి? నేప‌థ్యం ఏమిటీ? అంటూ ఆరాలు తీసారు. ఓవైపు సినిమా వాళ్ల‌ను న‌మ్మి పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని త‌న స్నేహితులు చిరుని వారించేవార‌ట‌. కానీ రామ‌లింగ‌య్య - అల్లు అర‌వింద్ స‌హా ఆ చిత్ర నిర్మాత విజ‌య‌కృష్ణ ప్ర‌భృతులు ఎట్టి పరిస్థితిలో చిరంజీవిని పెళ్లితో లాక్ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అలా అల్లు అర‌వింద్ సోద‌రి అల్లు రామ‌లింగ‌య్య గారి కుమార్తె సురేఖ‌తో పెళ్లి చూపులు ఖాయ‌మ‌య్యాయి. పెళ్లి కూడా హ‌డావుడిగానే జ‌రిగింది.

ఓ వైపు చిరంజీవి వ‌రుస‌గా ఐదారు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసుకునేదే లేదు. కానీ ఇలాంట‌ప్పుడు పెళ్లెందుకు అనుకునేవార‌ట‌. కానీ కాఫీ కోసం అల్లు వారు ఇంటికి పిలిచి మెగాస్టార్ ని ల‌ట‌క్క‌న లాక్ చేసేసార‌ట‌. ఆ కాఫీ తాగాక చిరుకి మ‌తి చెడింది. పెళ్లి చూపుల్లోనే తొలి చూపుకే సురేఖ‌కు ప‌డిపోయారు. సురేఖ స్వ‌యంగా పెట్టిన‌ కాఫీ తాగాక .. ఇంకేం ఉంది మ‌తి చెడి వెంట‌నే మ‌న‌సులో ఓకే అనేసుకున్నార‌ట‌. అలా చివ‌రికి పెళ్ల‌యింది. షూటింగుల బిజీతో నాలుగు నెల‌లు ఆగ‌మంటే కుర్రాడు ఎక్క‌డ మ‌ట్ట‌గిడ‌స‌లా జారిపోతాడోన‌నే భ‌యంతో అల్లు వారు వెంట‌నే ముహూర్తం పెట్టించి అస‌లు చిరుకి టైమ్ అన్న‌దే ఇవ్వ‌కుండా మూడుముళ్ల‌తో లాక్ చేసి ప‌డేసార‌ట‌. ఈ మొత్తం సంఘ‌ట‌న‌ల‌ను చిరు వ‌ర్ణించిన తీరుకు వేదిక వ‌ద్ద అహూతులు క‌డుపు చెక్క‌ల‌య్యేలా న‌వ్వారు. చిరు స్పీచ్ వింటే ప‌డి ప‌డి న‌వ్వ‌ని వారు ఉండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌గా అల్లూ జ‌యంతి రోజున మెగాస్టార్ స్పీచ్ అభిమానుల‌కు వీనుల‌విందునిచ్చింది.

ఈ వేదిక‌పై చిరు ఎంతో ఎమోష‌న‌ల్ గా మాట్లాడుతుంటే అల్లు అర్జున్ - అల్లు అర‌వింద్- సురేఖ- స్నేహా అర్జున్ స‌హా అంద‌రూ క‌డుపు చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతూ క‌నిపించారు. నిజానికి ఇది ఒక అద్భుత కుటుంబ వేడుక‌గా సాగింది. దివంగ‌త అల్లు రామ‌లింగ‌య్య కు ఈ వేడుక ఒక ఘ‌న‌మైన నివాళి అని చెప్పొచ్చు.