Begin typing your search above and press return to search.

ఒక బొమ్మరిల్లు గుర్తొచ్చింది -చిరంజీవి

By:  Tupaki Desk   |   31 July 2016 5:33 PM GMT
ఒక బొమ్మరిల్లు గుర్తొచ్చింది -చిరంజీవి
X
అల్లు శిరీష్-లావణ్య త్రిపాఠి జంటగా నటించిన శ్రీరస్తు శుభమస్తు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అంగరంగవైభవంగా నిర్వహించింది గీతా ఆర్ట్స్. ఈ ఫంక్షన్ కి స్పెషల్ అట్రాక్షన్ మెగాస్టార్ చిరంజీవి. తన మామగారు అల్లు రామలింగయ్య వర్ధంతి ఇవాళే అని గుర్తు చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. శిరీష్ నటనతో పాటు లావణ్య అందాన్ని కూడా పొగిడేశారు. ఇప్పటికే తాను రషెస్ చూశానన్న చిరంజీవి.. కథ గురించి కూడా చెప్పేశారు.

'అంతరాలు లేని ప్రేమ పెళ్ళిళ్లకు... అభ్యంతరాలు చెప్పే రిచ్ ఫాదర్ కి.. అభ్యుదయ భావాలు ఉన్న కొడుకుల మధ్య జరిగే ప్రేమపూర్వక సంఘర్షణ.. ఇగో క్లాష్.. ఇదే ఈ సినిమా కథాంశం. మధ్య తరగతి వాళ్లమీద చిన్నచూపు ఉన్న తండ్రికి.. ఇటు కొడుకులకు మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా ఇది.' అని చెప్పిన చిరు.. ఈ మూవీ చూస్తుంటే బొమ్మరిల్లు గుర్తొచ్చిందని.. అంత చక్కగా ఫ్యామిలీ సబ్జెక్ట్ ని దర్శకుడు డీల్ చేశాడని చెప్పారు. బొమ్మరిల్లు ఎలా జనాలను ఆకట్టుకుందో.. ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ అవుతుందని అన్నారు మెగాస్టార్.

ఇక శ్రీరస్తు శుభమస్తు టైటిల్ పై తాను ఓ సినిమా చేసిన సంగతి గుర్తు చేసుకున్న మెగాస్టార్.. 'తెలిసి పెట్టారో.. యథాలాపంగా పెట్టారో.. ఈ టైటిల్ ను అనుకుని పెట్టారో.. సబ్జెక్ట్ ప్రకారం పెట్టారో తెలీదు కానీ.. నేను శ్రీరస్తు శుభమస్తు అనే టైటిల్ తో సినిమా చేశాను. నేను.. సరిత హీరో హీరోయిన్లు కట్టా సుబ్బారావు డైరక్షన్లో చేసిన ఆ సినిమా పెద్ద హిట్టయ్యింది' అంటూ అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు చిరంజీవి.