Begin typing your search above and press return to search.

పాత్రల కోసం మెగా హీరోల పాట్లు

By:  Tupaki Desk   |   30 Oct 2017 11:23 AM IST
పాత్రల కోసం మెగా హీరోల పాట్లు
X
స్టార్ హీరోలు సినిమాల కోసం వారి శరీర ఆకృతిని ఏ విధంగా మార్చేసుకుంటారో తెలిసిందే. ప్రస్తుతం యువ హీరోలు ప్రయోగాత్మకమైన కథలో నటించే అవకాశం వస్తే ఎంతకైనా తెగిస్తున్నారు. సినిమా మీద ఇష్టంతో పాత్ర కోసం ప్రాణాన్నీ పణంగా పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. అప్పట్లో శరీర ఆకృతి గురించి అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు కథలో మ్యాజిక్ సక్సెస్ అవ్వాలంటే ఫిట్ నెస్ తో పోరాటాలు చేయాల్సిందే. బరువు తగ్గాలన్నా పెరగాలన్నా నిరంతరం కష్టపడాల్సిందే.

కుర్ర హీరోల సంగతి పక్కన పెడితే.. ఈ మధ్య సీనియర్ సూపర్ స్టార్లు ఫిట్ నెస్ కసరత్తులు కసిగా చేస్తున్నారు. అయిదు పదుల వయసుదాటిన కూడా కుర్ర హీరోలకు ధీటుగా శరీర ఆకృతిని ఈజీగా మార్చేసుకుంటున్నారు. వారిలో ఇప్పుడు ముగ్గురు మెగా హీరోలు వారి పాత్ర కోసం బరువు తగ్గబోతున్నారు. కథ కోసం స్లిమ్ గా రెడీ అవ్వాలని అనుకుంటున్నారు. ముందుగా తెలుగు మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా కోసం నరసింహా రెడ్డి పాత్రలో చిరు ఫిట్ గా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. తనయుడు చరణ్ కూడా తండ్రికి ఫిట్ నెస్ పాటలు చాలా నేర్పిస్తున్నాడట.

ఇక భారతీయుడు సీక్వెల్ సినిమా కోసం తమిళ మెగాస్టార్ కమల్ హాసన్ కొంచెం కండలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శంకర్ ముందే ఆయన పాత్ర ఆకృతి ఎలా ఉండాలో క్లియర్ గా చెప్పారట. అందుకే ఫారిన్ ట్రైనర్ సహకారంతో కమల్ కసరత్తులు మొదలెట్టారు. ఇదే తరహాలో కంప్లిట్ యాక్టర్.. మల్లూ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా బరువు తగ్గాలని అనుకుంటున్నారట. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న ఒడియన్ చిత్రం కోసం తన చబ్బీ ఆకృతిని స్లిమ్ గా చేసుకోనున్నారట. ఈ ముగ్గురు స్టార్స్ ఎవరి భాషలో వారు మెగా స్టార్సే. మరి ఎంతవరకు వారి ఫిట్ నెస్ కి తగిన న్యాయం చేయగలుగుతారో చూడాలి.