Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీని 'సౌత్ కపూర్లు' గా పిలవాలని కోరుకుంటున్న చిరంజీవి..!

By:  Tupaki Desk   |   26 April 2022 10:00 PM IST
మెగా ఫ్యామిలీని సౌత్ కపూర్లు గా పిలవాలని కోరుకుంటున్న చిరంజీవి..!
X
మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయింది. ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరంజీవి.. తమని 'సౌత్ కపూర్లు' గా పిలవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో జరిగిన సంభాషణను చేసుకుంటూ.. వారి కుటుంబాన్ని దక్షిణాది కపూర్లుగా పిలవాలనే తన కోరికను వ్యక్తం చేశారు.

“హిందీ సినిమాలో కపూర్ ఫ్యామిలీకి క్రేజ్ ఉంది. సౌత్ సినిమాలో మా కుటుంబం కూడా అలా ఉండాలని నేను కోరుకున్నాను. పిల్లలు అందరూ సినీరంగంలో తమకంటూ ఓ పేరు తెచ్చుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’’ అని చిరంజీవి అన్నారు. గతంలో ఉత్తరాదికి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన అవమానాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు చిరు.

'రుద్రవీణ సినిమాకు జాతీయ సమగ్రతలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా నర్గీస్ దత్ అవార్డును గెలుచుకున్నప్పటికీ.. అవార్డు కార్యక్రమంలో దక్షిణాది ప్రస్తావన చాలా తక్కువగా ఉంది. దాన్ని నేను అవమానంగా భావించాను. కానీ ఇప్పుడు నేను ప్రాంతీయ భావం నెమ్మదిగా చెరిగిపోతుండటం సంతోషంగా ఉంది" అని చిరంజీవి తెలియజేసారు.

చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ, "ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. నటుడిగా చరణ్ అద్భుతమైన ఎదుగుదలను చూసిన అదృష్టవంతుడిని నేను" అని అన్నారు. ఇక సిద్ధ పాత్రలో పవన్ కల్యాణ్ ఉంటే బాగుండేదినిపించిందా అని ఓ ప్రశ్నకు చిరు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.

''చరణ్ కాకుండా మరే నటుడైనా సిద్ధ పాత్రకు న్యాయం చేసేవారే. అయితే, నిజ జీవితంలో తండ్రీకొడుకులు ఈ పాత్రలు చేస్తే, వాటి మధ్య అనుబంధం మరింత బలంగా తెరపై కనిపిస్తుంది. కథకు అదనపు బలం చేకూరుతుంది. ఒకవేళ చరణ్ కూడా చేయకపోతే ప్రత్యామ్నాయం పవన్​కల్యాణ్. ఎందుకంటే కథలో ఆ ఫీల్ వంద శాతం పవన్ తీసుకువస్తాడని నా అభిప్రాయం. అంతవరకూ ఛాన్స్ తీసుకోలేదు" అని చిరు చెప్పుకొచ్చారు.