Begin typing your search above and press return to search.

శంకర్ - చరణ్ సినిమాలో చిరంజీవి..?

By:  Tupaki Desk   |   9 Sep 2021 3:30 PM GMT
శంకర్ - చరణ్ సినిమాలో చిరంజీవి..?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ ని బుధవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. దీని కోసం ముందుగానే నటీనటులు, దర్శకనిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు అందరూ సూటు బూటు వేసుకొని ఫోటో షూట్ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

'RC15' లాంచింగ్ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి - దర్శకధీరుడు రాజమౌళి - బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ - తమిళ దర్శకుడు లింగుస్వామి వంటి ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ ఇవ్వగా.. రణవీర్ సింగ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. రాజమౌళి స్క్రిప్ట్ అందించారు. అయితే చిరు - రణవీర్ వంటి స్టార్స్ ఈ ప్రోగ్రామ్ లో కనిపించడంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

'శంకర్ - చరణ్' సినిమాలో మరో కీలక పాత్ర ఉంటుందని.. సినిమాలో దాదాపు 20 నిమిషాల నిడివి ఉండే రాజకీయ నాయకుడి పాత్ర అని చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ చిత్రంలో ఆ పాత్రను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ నటిస్తారని చెప్పుకున్నారు. ఈ క్రమంలో తెలుగులో పవన్ కళ్యాణ్ - హిందీలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే RC15 లాంచింగ్ ఈవెంట్ చూసిన తర్వాత ఈ సినిమాలో కీలకమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కాదు చిరంజీవి కనిపించబోతున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. అలానే హిందీలో రణవీర్ సింగ్ ఈ క్యారక్టర్ లో కనిపించవచ్చని అంటున్నారు. శంకర్ దర్శకత్వంలో నటించాలని చిరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలే కనుక నిజమైతే మెగా కోరిక ఈ విధంగా నెరవేరే అవకాశం ఉంటుంది.

కాకపోతే ఫిలిం సర్కిల్స్ లో వస్తున్న టాక్ ప్రకారం RC15 మేకర్స్ ఇంకా ఆ పాత్ర గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొంత భాగం షూటింగ్ జరిగిన తర్వాత అప్పటి పరిస్థితులు - బడ్జెట్ ని బట్టి నిర్మాతలు దీనిపై ఓ నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది. మరి చివరకు చరణ్ సినిమాలోకి ఎవరిని తీసుకొస్తారో చూడాలి.

Rc15 లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ - అంజలి - సునీల్ - జయరామ్ - నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. రామజోగయ్య శాస్త్రి - అనంత శ్రీరామ్ పాటలు రాస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. తిరు సినిమాటోగ్రాఫర్ గా.. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన ఈ 50వ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ''విశ్వంభర'' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.