Begin typing your search above and press return to search.

ఈ శివశంకర వరప్రసాద్ ముందే కుప్పిగంతులా: చిరంజీవి

By:  Tupaki Desk   |   24 April 2022 10:00 AM IST
ఈ శివశంకర వరప్రసాద్ ముందే కుప్పిగంతులా: చిరంజీవి
X
'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదికపై ఒక ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. చిరంజీవి .. కొరటాల .. చరణ్ స్టేజ్ పై ఉండగా, అభిమానుల నుంచి ప్రశ్నల జాబితా అంటూ సుమ ఈ ముగ్గురినీ కొన్ని ప్రశ్నలు అడిగింది. ముగ్గురూ కూడా సరదాగా సమాధానాలు ఇవ్వడంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది. ' చిరంజీవి .. చరణ్ లలో ఎవరు బాగా డాన్స్ చేస్తారు?' అనే ప్రశ్నను కొరటాలను సుమ అడిగింది. ఆ ప్రశ్నకి ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు.

అప్పడు చిరంజీవి జోక్యం చేసుకుంటూ .. "నా పేరు శివశంకర వరప్రసాద్. శివుడు దేనికి ప్రసిద్ధి .. నృత్యానికి ప్రసిద్ధి. శివుడి ముందు ఎవరైనా డాన్స్ చేయగలరా? ఎవరైనా కానీ .. శివుడి తరువాతనే. ఆ శివతాండవం తరువాతనే. నాది కూడా అదే ఆన్సర్ అంటూ అప్పుడు కొరటాల ముందుకు వచ్చాడు. వాళ్లని కూడా ఎంకరేజ్ చేయాలి గనుక నేను కావాలని తగ్గుతాను అని చిరంజీవి అన్నారు. ఇక ఒక మూవీకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సెన్ డైరెక్టరా? .. యాక్టరా? అనే ప్రశ్నకి చిరంజీవి స్పందిస్తూ .. కచ్చితంగా డైరెక్టరే ముఖ్యం అంటూ సమాధానమిచ్చారు.

ఆ తరువాత 'ఈ ఇద్దరిలో మీరు ఎవరికీ ఎక్కువగా భయపడతారు? నాన్నగారు - ఉపాసన గారు అంటూ చరణ్ కి సుమ ఆప్షన్స్ ఇచ్చింది. ఆ ప్రశ్నకి చరణ్ నవ్వుతూ .. "మా నాన్నగారు మా అమ్మ ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అది నేర్చుకుని నేను కూడా ఉపాసన ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటాను. మా అందరికీ బాస్ మా అమ్మనే" అని సమాధానమిచ్చాడు. అప్పడూ చిరంజీవి కల్పించుకుంటూ .. ''నన్ను చూసి నేర్చుకున్నావన్న మాట .. సుఖపడతావ్ .. సుఖపడతావ్. వాళ్లతో పెట్టుకోవద్దు" అంటూ నవ్వేశారు.

కొరటాల శివ రాసిన ఆచార్య పాత్ర అంటే ఇష్టమా? సిద్ధ పాత్ర అంటే ఇష్టమా? అనే ప్రశ్న చిరంజీవికి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఈ రెండు పాత్రలను ఓపెన్ గా పెట్టేసి ఏ పాత్రను చేస్తారని అడిగితే నేను సిద్ధ పాత్రనే చేస్తాను. సిద్ధ పాత్రలో అన్ని వేరియేషన్స్ ఉంటాయి గనుక, ఆ పాత్రను చేయాలనిపిస్తుంది" అని అన్నారు. ఇక తనకి ఇష్టమైన వంటకానికి సంబంధించిన ప్రశ్నకి సమాధానంగా 'చేపల పులుసు' అని చిరంజీవి చెప్పారు. ఇలా ఈ ఎపిసోడ్ అంతా కూడా అందరూ హాయిగా నవ్వుకునేలా సాగింది.