Begin typing your search above and press return to search.

మాయావితో మెగాస్టార్ క‌న్ఫామ్‌

By:  Tupaki Desk   |   27 Dec 2018 11:58 PM IST
మాయావితో మెగాస్టార్ క‌న్ఫామ్‌
X
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `విన‌య విధేయ రామా` ఈవెంట్ లో ఓ స‌ర్ ప్రైజ్ గెస్ట్ గురించి ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించుకోవాలి. చ‌ర‌ణ్ కోసం చిరు వ‌చ్చారు స‌రే... అది చాలా కామ‌న్ అనుకోవ‌చ్చు. అలాగే చ‌ర‌ణ్ కోసం స్నేహితుడు కేటీఆర్ ఇదే వేదిక‌పైకి వ‌చ్చారు. అది కూడా స‌హ‌జ‌మే అని భావించ‌వ‌చ్చు. కానీ ఇదే వేదిక‌పై మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంపైనే అంద‌రూ సందేహం వ్య‌క్తం చేశారు. అస‌లు ఇలాంటి ప‌బ్లిక్ వేదిక‌ల‌కు త్రివిక్ర‌మ్ రెగ్యుల‌ర్ గా రానే రారు. తన సినిమాల ఈవెంట్లు, అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈవెంట్ల‌కు త‌ప్ప వేరొక ఈవెంట్ కి ఆయ‌న అటెండ్ కావ‌డం అన్న‌దే అరుదు. నిరంత‌రం త‌న సినిమాలకు సంబంధించిన బిజీ షెడ్యూల్స్ తోనూ మాయావి ఎవ‌రికీ చిక్క‌రు దొర‌క‌రు. కానీ స‌డెన్ గా చ‌ర‌ణ్ వేదిక‌పై ఆయ‌న ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

ఇందులో ప‌ర‌మార్థం ఏం ఉంది? అని వెతుక్కుంటున్న వారికి వెత‌క బోయిన తీగ కాలికి త‌గిలింది. వేదిక‌పైనే అదిరిపోయే ట్విస్టు ఇచ్చారు. స‌డెన్ గా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అస‌లు సంగ‌తిని రివీల్ చేశారు. త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వం లో ఓ సినిమా చేస్తున్నాను. ఈ ప్రాజెక్టును ఫిక్స్ చేసింది రామ్ చ‌ర‌ణ్. త‌నే ద‌గ్గ‌ర ఉండి ఓకే చెప్పించాడు. డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారు అని మెగాస్టార్ తెలిపారు.

ఓవైపు మెగాస్టార్ చిరంజీవి సురేంద‌ర్ రెడ్డి దర్శ‌క‌త్వంలో `సైరా-న‌ర‌సింహారెడ్డి` చిత్రంలో న‌టిస్తున్నారు. ఇది భారీ వారియ‌ర్ సినిమా. కెరీర్ లో 151వ సినిమా. ఆ త‌ర్వాత 152వ సినిమా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ఇది సినిమా సోష‌ల్ మెసేజ్ ఉండే క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ తో చిరు సినిమా ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. సైరా- న‌ర‌సింహారెడ్డి ఈ స‌మ్మ‌ర్‌లో రిలీజైతే, అటుపై కొర‌టాల సినిమా సెట్స్ కెళుతుంది. 2019 ఎండింగ్ లో లేదా 2020 ఆరంభంలో త్రివిక్ర‌మ్ తో సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంటుంద‌న్న‌మాట‌. బ‌హుశా త్రివిక్ర‌మ్ చ‌ర‌ణ్ ఈవెంట్ కి రావ‌డం వెన‌క కార‌ణం కూడా ఇదే అయ్యి ఉంటుంద‌న్న చ‌ర్చా సాగుతోంది.