Begin typing your search above and press return to search.

సీసీసీ పంపిణీ చేసే సరుకుల నాణ్యతను ఆ విధంగా చెక్ చేసిన మెగాస్టార్...!

By:  Tupaki Desk   |   15 April 2020 6:50 AM GMT
సీసీసీ పంపిణీ చేసే సరుకుల నాణ్యతను ఆ విధంగా చెక్ చేసిన మెగాస్టార్...!
X
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో ఆకలి కేకలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. కరోనా కష్టానికి టాలీవుడ్ కూడా ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీ.సీ.సీ) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ ఛారిటీకి సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ - సురేష్ బాబు - సి.కళ్యాణ్ - డైరెక్టర్ ఎన్ ఈ. శంకర్ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఛారిటీ ద్వారా సాటి కళారుల పట్ల ఎంతో ఔదార్యంతో ముందడుగు వేస్తున్నారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో వేలాది మంది సినీ కార్మికులు జీవనోపాది కోల్పోయారు. అంతే కాకుండా చాలా వరకు సినీ రంగంలో వలస కార్మికులు ఎక్కువగా ఉండడంతో వారికి స్థానికి రేషన్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వాలు ప్రకటిస్తున్న రాయితీలను కూడా సినిమా కార్మికులు పెద్దగా అందుకోలేరు. దీంతో ఎక్కడ పని ఎక్కువగా ఉంటుందో - ఎక్కడ సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతాయో అక్కడ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుంటారు సిని కార్మికులు. వీరిని ఆదుకోవడం కోసం కరోనా క్రైసిస్ చారిటీ నడుం బిగించింది.

ఉపాది కోల్పోయిన సినీ కార్మికులకు కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా ఉచితంగా సుమారు 18 రకాల నిత్యావసర సరుకులను అందించనున్నారు. ఈ ఛారిటీ ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల నాణ్యతలో రాజీ పడేది లేదని సీసీసీ నిర్వహకులు చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా పంపిణీ చేస్తున్న సరుకుల నాణ్యతను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తనిఖీ చేసిన విధానం పట్ల - కార్మికుల పట్ల ఆయనకున్న చిత్త శుద్ది తెలుస్తోంది. కార్మికులకు పంపిణి చేసే సరుకుల్లోంచి ఓ సరుకుల ప్యాకేజీని ఇంటికి తప్పించుకుని ప్రత్యక్షంగా వాటి క్వాలిటీని చెక్ చేసారట చిరంజీవి. అంతే కాకుండా సీసీసీ తరుపున ఉచితంగా ఇచ్చే 25 కిలోల బియ్యం బస్తాలోని బియ్యాన్ని కూడా చిరంజీవి తనిఖీ చేసినట్టు తెలుస్తోంది. గత వారం సీసీసీ తరుపున పంపిణీ చేస్తున్న రైస్ బ్యాగ్ ను ఇంటికి తెప్పించుకున్న చిరంజీవి అదే బ్యాగ్ లోని బియ్యాన్ని వండించుకున్నట్టు సమాచారం. సీసీసీ పంపిణీ చేస్తున్న సరకులతో పాటు బియ్యం నాణ్యతను చిరంజీవి ఈ విధంగా చెక్ చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మెగాస్టార్ గా చిరంజీవి స్పందించే విధానం ఎప్పుడూ అందరికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన్ని కొనియాడుతున్నారు.