Begin typing your search above and press return to search.

ఇది అడుక్కుతినడం కాదు: 'ఆచార్య' ప్రెస్ మీట్లో చిరంజీవి

By:  Tupaki Desk   |   26 April 2022 8:40 AM GMT
ఇది అడుక్కుతినడం కాదు: ఆచార్య ప్రెస్ మీట్లో చిరంజీవి
X
చిరంజీవి - చరణ్ కథానాయకులుగా కొరటాల శివ 'ఆచార్య' సినిమాను రూపొందించాడు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ కొంతసేపటికితం హైదరాబాద్ లో జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి .. చరణ్ .. కొరటాల .. పూజ హెగ్డే పాల్గొన్నారు. ''చిరంజీవి సినిమా అంటేనే అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయి. అలాంటప్పుడు 'ఆచార్య'కి టికెట్ రేటు పెంచవలసినన అవసరం ఉందా?' అనే ప్రశ్న పాత్రికేయుల నుంచి ఎదురైంది.

ఆ మాటకు కొరటాల స్పందిస్తూ .. "ఈ సినిమా కోసం చిరంజీవి గారు మూడేళ్లు కష్టపడ్డారు. చరణ్ గారు 'ఆర్ ఆర్ ఆర్' నుంచి అనుమతి తీసుకుని వచ్చి మరీ పనిచేశారు. నేను నాలుగేళ్ల పాటు ఈ ప్రాజెక్టుపై పనిచేస్తూ వస్తున్నాను. ఈ నాలుగేళ్లుగా నేను సినిమా చేయలేదు. ఇంకా ఎకౌంట్ సెటిల్ చేసుకోవడం జరగలేదు.

ప్రతి సినిమాకి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది. ఆ బడ్జెట్ ను బట్టే టిక్కెట్ల రేటును పెంచడం జరుగుతుంది. అంతేగానీ ఇష్టానుసారం టిక్కెట్ల రేటు పెంచడం జరగదు" అని అన్నారు.

ఇదే ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ .. "పాండమిక్ కారణంగా చాలా రంగాలు కుదేలయ్యాయి. అలా సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందుల్లో పడింది. వడ్డీగా 50 కోట్లను కట్టడమనేది ఎప్పుడైనా విన్నారా? ఎవరిస్తారు చెప్పండి?

ప్రభుత్వాలు కనికరించి ఇలాంటి జీవోలు ఇస్తే, మనకి ఇంత వినోదాన్ని ఇచ్చారు మనం కూడా ఒక పది రూపాయలు ఇద్దామని ప్రేక్షకులు అనుకుంటారు. ఇది అడుక్కుతినడం కాదు. వినోదాన్ని అందించే ప్రయత్నంలో అనుకోకుండా అంతకంతకీ వడ్డీలు అయ్యాయి. వడ్డీనే ఒక మీడియం సినిమా బడ్జెట్ అంత అయింది.

ప్రపంచంలో అన్ని రంగాల మాదిరిగానే మేము కూడా నష్టపోయాము. అందువలన ప్రభుత్వాల దగ్గర వేడుకోవడంలో తప్పేమీ లేదు. ఇండస్ట్రీ నుంచి 42 పెర్సెంట్ టాక్సులు వెళుతున్నాయి. అందులో నుంచి మాకు కొంత ఇవ్వండి అని అడగడం తప్పని నేను అనుకోవడం లేదు" అంటూ సమాధానమిచ్చారు.