Begin typing your search above and press return to search.

చిరు 151.. బాలయ్య 101..

By:  Tupaki Desk   |   20 July 2015 11:51 AM IST
చిరు 151.. బాలయ్య 101..
X
నటసింహా బాలకృష్ణ 100 సినిమాలకు చేరువగా ఉన్నారు. అతడు ప్రస్తుతం 99వ సినిమా డిక్టేటర్‌ లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వకుండానే 100వ సినిమాకి సంబంధించిన శుభవార్త వెలువడనుంది. ఈలోగానే గత ఏడాది అతడు నటించిన లెజెండ్‌ చిత్రం లో నటనకు గాను ఉత్తమనటుడి గా పురస్కారం లభించింది. టీఎస్సార్‌ అండ్‌ టీవీ9 అవార్డుల కార్యక్రమం లో మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా బాలయ్య బాబు ను సత్కరించి పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ఇది అరుదైన దృశ్యం. అరుదైన గౌరవం. అంతేనా 'మన బాలయ్య కు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది' అంటూ చిరు నోట ఆ మాట వెలువడగానే అటు నందమూరి అభిమానుల్లో ఆనందం ఉరకలెత్తింది. తెలుగు సినిమా హీరోల మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం హైలైట్‌ అయ్యింది ఈ సన్నివేశం లో. ఇదే వేదికపై మోహన్‌ బాబు 'రౌడీ' చిత్రానికిగానూ పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్‌ మేటి నటులు శత్రుఘ్న సిన్హా, రిషీకపూర్‌, శక్తికపూర్‌ తదితరుల సమక్షం లో ఈ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. వేదికపై మాట్లాడిన బాలీవుడ్‌ వక్తలు బాహుబలి విజయాన్ని ఆకాశానికెత్తేశారు. భారతీయ సినిమా గర్వించదగ్గ సినిమా ఇదని ప్రశంసించారు.

అయితే మెగా-నందమూరి అభిమానుల్లో మాత్రం ఓ సందేహం అలానే ఉండిపోయింది. అసలు మెగాస్టార్‌ చిరంజీవి, నటసింహా బాలయ్య కలిసి ఓ సినిమాలో నటిస్తేనో? అది బాలయ్యకు 101వ సినిమాగా, చిరుకి 151వ సినిమాగా అయితే బావుండేదే అనుకున్నారంతా.