Begin typing your search above and press return to search.

స్పెషల్ స్టోరీ : మెగాస్టార్ మెగా రీమేక్స్...!

By:  Tupaki Desk   |   5 Sep 2020 2:30 AM GMT
స్పెషల్ స్టోరీ : మెగాస్టార్ మెగా రీమేక్స్...!
X
టాలీవుడ్‌ లో ఈ మధ్య రీమేక్‌ సినిమాల గురించి ఎక్కువగా డిష్కసన్ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ సినిమా 'లూసిఫర్' మరియు తమిళ్ సక్సెస్ఫుల్ 'వేదలమ్' చిత్రాలను తెలుగులో రీమేక్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే రీమేక్ చేయడం అనేది కొత్తేమీ కాదు. ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో 'మెగాస్టార్' అనిపించుకోక ముందే ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులోకి రీమేక్ చేశారు. వాటిలో కొన్ని ఒరిజినల్ మూవీ కంటే పెద్ద హిట్ అయితే మరికొన్ని ప్లాప్ సినిమాలుగా మిగిలిపోయాయి.

చిరంజీవి 1981లో 'చట్టానికి కళ్లు లేవు' అనే సినిమాలో నటించాడు. ఎస్ ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మాధవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రజినీకాంత్ నటించిన తమిళ్ హిట్ మూవీ 'సత్తం ఒరు ఇరుత్తరై' కి రీమేక్ గా తెరకెక్కి మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

1982లో చిరంజీవి - మోహన్ బాబు హీరోలుగా నటించిన 'పట్నం వచ్చిన పతివ్రతలు' సినిమా 'పట్టనక్కే బంధ పత్నియారు' అనే తమిళ్ చిత్రానికి రీమేక్ గా వచ్చింది. ఇక 1985లో చిరు నటించిన 'విజేత' మూవీ కూడా హిందీ సినిమాకి రీమేక్ గా వచ్చింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 'సాహెబ్' అనే హిందీ చిత్రానికి రీమేక్.

1987లో చిరంజీవి - కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన 'పసివాడి ప్రాణం' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విజయశాంతి - సుమలత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మమ్ముట్టి 'పూవిన్ను పుతియా పూంతెనాల్' అనే మలయాళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. చిరు బాలీవుడ్ డెబ్యూ మూవీ 'ప్రతిబంధ్'.. రాజశేఖర్ నటించిన తెలుగు సినిమా 'అంకుశం'కి రీమేక్. 1990లో వచ్చిన 'ప్రతిబంధ్' చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా.. ఒరిజినల్ మూవీ 'అంకుశం'కి కోడి రామకృష్ణ డైరెక్షన్ చేశారు. మెగాస్టార్ - రాఘవేంద్ర రావు కాంబోలో వచ్చిన 'ఘరానా మొగుడు' సినిమా 'అనురాగ అరితాలు' అనే కన్నడ మూవీకి రీమేక్ గా వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది.

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'హిట్లర్' మూవీ మమ్ముట్టి నటించిన 'హిట్లర్' అనే మలయాళ చిత్రానికి రీమేక్. చిరంజీవి - విజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'స్నేహం కోసం' సినిమా తమిళ్ 'నాట్పుక్కగా' సినిమాకి రీమేక్ అనే విషయం తెల్సిందే. తమిళ్ లో కూడా విజయ్ కుమార్ నటించడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమా 'ఠాగూర్' తమిళ్ లో విజయ్ కాంత్ హీరోగా నటించిన 'రమణ' సినిమాకి రీమేక్ గా వచ్చింది. తమిళ్ లో మురగదాస్ తీసిన ఈ సినిమాని తెలుగులో వీవీ వినాయక్ డైరెక్ట్ చేశాడు.

జయంత్ సి.పరాంజీ దర్శకత్వంలో చిరు నటించిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమా.. హిందీ 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ప్రభుదేవా - చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన 'శంకర్ దాదా జిందాబాద్' మూవీ 'లగే రహో మున్నాభాయ్' సినిమాకి రీమేక్. మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నెం. 150' సినిమా మురగదాస్ - విజయ్ కాంబోలో వచ్చిన 'కత్తి' సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. చిరు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు.