Begin typing your search above and press return to search.

చిరంజీవి 'ఆచార్య' విడుదల తేదీని అందుకే ప్రకటించడం లేదట..!

By:  Tupaki Desk   |   20 Sep 2021 9:38 AM GMT
చిరంజీవి ఆచార్య విడుదల తేదీని అందుకే ప్రకటించడం లేదట..!
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడం లేదు.

నిజానికి 'ఆచార్య' చిత్రాన్ని మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పడటంతో విడుదల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి తదుపరి రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. తండ్రీకొడుకులు కలసి నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా బరిలో నిలుపుతారని.. కాదు సంక్రాంతి పండక్కి తీసుకొస్తారని రూమర్స్ వచ్చాయి.

అయితే 'ఆచార్య' మేకర్స్ మాత్రం ఈ సినిమా విడుదల తేదీపై మౌనం వహిస్తూ వచ్చారు. దీంతో మెగా మూవీ విడుదల పై ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని అందరు ఆలోచిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై 'లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

సినీ ఇండస్ట్రీలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన చిరంజీవి.. 'ఆచార్య' సినిమా విడుదల ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమా పూరైయిపోయిందని.. కాకపోతే ఇప్పుడు విడుదల చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయామని అన్నారు.

'ప్రస్తుతం పరిస్థితుల్లో సినిమాని విడుదల చేస్తే మనం టార్గెట్ ను రీచ్ అవ్వగలమా? రెవెన్యూ వస్తుందా రాదా? అనే సందేహాలు ఉండేవి. ఇప్పుడిప్పుడే జనం థియేటర్లకు వస్తారా అనే భయం పోయి నెమ్మదిగా ధైర్యం వస్తోంది. ‘లవ్ స్టోరీ’ లాంటి సినిమాలను చూడడానికి జనాలు ఖచ్చితంగా వస్తారు. అయితే సినిమా విడుదలయ్యాక రెవెన్యూ వస్తుందా? అనేది మాత్రం మనం ఆలోచించాలి''

''ప్రభుత్వాలు ఆ ధైర్యం, వెసులుబాటు కల్పించాలి. మా కోరికను ఇప్పటికే విన్నవించాము. దానికి సానుకూలంగా స్పందించి ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము'' అని చిరంజీవి చెప్పుకొచ్చారు. థియేటర్ల పరిస్థితి - టిక్కెట్టు ధరల సవరణ వంటి వాటి వల్ల 'ఆచార్య' విడుదలకు వెనకడుగు వేస్తున్నారని స్పష్టం అయ్యింది.

అయితే టాలీవుడ్ సమస్యలపై చర్చించడానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇవాళ ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని తో భేటీ అయ్యారు. ఒకవేళ ఈ మీటింగ్ లో నిర్ణయాలు సానుకూలంగా ఉంటే చిరంజీవి 'ఆచార్య' సినిమా విడుదల గురించి ఆలోచించే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మరో సమస్య ఏమిటంటే.. ఇప్పటికే మంచి తేదీలను ఇతర పెద్ద సినిమాలు బ్లాక్ చేసి పెట్టుకున్నారు.

దసరా కోసం మీడియం రేంజ్ సినిమాలు నాలుగు కర్చీఫ్స్ వేసుకొని కూర్చున్నాయి. క్రిస్మస్ కు రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో పాటుగా మరో రెండు క్రేజీ మూవీస్ రాబోతున్నాయి. వచ్చే సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు బరిలో దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి 'ఆచార్య' చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.