Begin typing your search above and press return to search.

కింగ్ ఫిషర్ అంటున్న చిన్నికృష్ణ

By:  Tupaki Desk   |   16 Dec 2019 10:48 AM GMT
కింగ్ ఫిషర్ అంటున్న చిన్నికృష్ణ
X
సీనియర్ రచయిత చిన్నికృష్ణ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథ అందించిన సంగతి తెలిసిందే. ఆయన కెరీర్లో 'ఇంద్ర'.. 'నరసింహనాయుడు' లాంటి ఎన్నో సూపర్ హిట్లు ఉన్నాయి. తాజాగా ఆయన నిర్మాతగా మారి ఓ కొత్త బ్యానర్ ను స్థాపించి తన మొదటి సినిమాను ప్రకటించారు.

చిన్ని కృష్ణ తన నిర్మాణ సంస్థకు చిన్నికృష్ణ స్టూడియో అని పేరు పెట్టారు. ఈ సంస్థ నిర్మిస్తున్న మొదటి సినిమా 'కింగ్ ఫిషర్'. సహజంగా ఈ పేరు వినగానే విజయ్ మాల్యా కంపెనీ కింగ్ ఫిషర్ గుర్తొస్తుంది.. కింగ్ ఫిషర్ చిల్డ్ బీరు..హాటు ఘాటు క్యాలెండర్లు గుర్తొస్తాయి. కానీ ఈ సినిమా టైటిల్ కు ఈ కూల్.. హాట్ కింగ్ ఫిషర్లకు సంబంధం లేదట. నిజానికి కింగ్ ఫిషర్ అనేది ఒక పక్షి పేరు. ఈ సినిమాకు ఆ పక్షిపేరే పెట్టుకున్నారట. ఈ సినిమాకు 'పలాస 1987' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తాడు. ఈ సినిమాలో నూతన నటీనటులను తీసుకుంటారట. ఇప్పటికే క్యాస్టింగ్ కాల్ కూడా వచ్చింది.

ఇక ఈ సినిమా సోషల్ మీడియా జెనరేషన్ కు తగ్గట్టుగా బోల్డ్ గా ఉంటుందని. రస్టిక్ ఫీల్ తో తెరకెక్కిస్తారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా కొంత విభిన్నంగానే ఉంది. చిన్ని కృష్ణ స్టూడియోస్ కు లోగో ఒక కింగ్ ఫిషర్ పక్షి. ఇక సినిమా టైటిల్ లో ఇంగ్లిష్ లో ఉంది. కింగ్ ఫిషర్ లో లాస్ట్ ఆక్షరమైన ఆర్ రివర్స్ లో ఉంది. ఇక ఈ సినిమా టైటిల్ 'అల్ హ్యూమన్స్ ఆర్ నాట్ బ్యాడ్'(మనుషులందరూ చెడ్డవారు కాదు). ఇదే పోస్టర్ లో ఒక వ్యక్తి వెనుక వైపుకి తిరిగి చేతులు రెండు చాపి షర్టు లేకుండా నిల్చున్నాడు. వీపు భాగంలో 'ఓం' అనే పచ్చబొట్టు ఉంది. పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఈ సినిమాతో చిన్ని కృష్ణ నిర్మాతగా కూడా విజయం సాధిస్తారా అనేది వేచి చూడాలి.