Begin typing your search above and press return to search.

చిరు అల్లుడిపై అటాక్

By:  Tupaki Desk   |   3 July 2018 9:53 AM GMT
చిరు అల్లుడిపై అటాక్
X
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ‘విజేత’. ఈ చిత్రాన్ని ముందు జులై 6కే రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ.. అదే రోజుకు చిరు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమా ‘తేజ్ ఐ లవ్యూ’ షెడ్యూల్ కావడంతో దీన్ని వాయిదా వేశారు. సోలో రిలీజ్ ఛాన్సుంటుందని ఆ డేట్ ఎంచుకుంటే.. ‘విజేత’కు పోటీగా ఒకటికి రెండు సినిమాలు తయారయ్యాయి. అవి రెండూ ‘విజేత’ టీంను కొంచెం కంగారు పెట్టేవే.

విజేత’కు పోటీగా ఒక తెలుగు సినిమా.. ఒక డబ్బింగ్ సినిమా రాబోతున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ స్టయిల్లో కొంచెం డిఫరెంటుగా కనిపించిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా 12వ తేదీకే ఫిక్సయింది. హీరో హీరోయిన్లతో పాటు దర్శక నిర్మాతలు కూడా కొత్త వాళ్లే కానీ.. వెరైటీ ప్రోమోలతో ఆ చిత్రం యువతలో క్రేజ్ సంపాదించుకుంది. ప్రమోషన్లు కూడా కొంచెం గట్టిగానే చేస్తున్నారు. మరోవైపు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న కార్తి నటించిన డబ్బింగ్ సినిమా ‘చినబాబు’ కూడా 12వ తేదీనే రానుంది. మధ్యలో కొంచెం దారి తప్పినప్పటికీ ‘ఊపిరి’.. ‘ఖాకి’ సినిమాలతో మళ్లీ తెలుగులో మార్కెట్ సంపాదించుకున్నాడు కార్తి. ‘చినబాబు’ టీజర్ కూడా ఆకట్టుకుంది.

మరి ఈ రెండు సినిమాల పోటీని ‘విజేత’ ఎలా తట్టుకుంటుందో చూడాలి. వీటిలో ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఏదో చెప్పలేం. దేని బలాలు దానికున్నాయి. అలాగే బలహీనతలూ ఉన్నాయి. ఐతే తొలి సినిమా మీద చాలా ఆశలతో ఉన్న చిరు అల్లుడికి మాత్రం ఈ పోటీ కొంచెం కంగారు పెట్టేదే. చూద్దాం మరి ఈ పోటీని తట్టుకుని అతడి సినిమా ఎలా నిలబడుతుందో?