Begin typing your search above and press return to search.

సామాన్యుడి త్యాగం అంతైతే.. ఇంకెంత చేయాలి?

By:  Tupaki Desk   |   6 Oct 2016 7:08 AM GMT
సామాన్యుడి త్యాగం అంతైతే.. ఇంకెంత చేయాలి?
X
మంచి మాటలు చెప్పటం తప్పేం కాదు. కానీ.. అలాంటి మాటలు చెప్పే ముందు అలాంటి వాటిని మనం ఎంతవరకూ చేస్తున్నామన్నది చాలా ముఖ్యం. రాజకీయ నాయకులు.. పెద్ద మనుషుల్లా ఫోజులు కొట్టే వారు చెప్పే మాటలకు.. దైవ స్వరూపానికి ప్రతిరూపాలుగా చెప్పుకునే సాములోళ్లు ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి? మాటల విషయంలో అందరూ ఒకేలా ఉన్నారే అనిపించేలా తాజాగా ఒక ప్రముఖ స్వామీజీ మాటలు ఉండటం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా.. పలువురు రాజకీయనేతలకు.. బడా పారిశ్రామికవేత్తలకు చినజీయర్ స్వాములోరంటే మహా గౌరవం.. మర్యాద. దీనికి తగ్గట్లే సాములోరి తీరు ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటూ.. తనదైన శైలిలో అధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.అలాంటి ఆయన ఈ మధ్యన రామానుజాచార్యులకు సంబంధించిన ప్రాజెక్టులు.. అందుకు సంబంధించిన బడ్జెట్ వివరాలు బయటపెట్టినప్పుడు కోట్లాది మందికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. వ్యవస్థలు చేపట్టేస్థాయిలో సాములోరు వందల కోట్ల ఖర్చుతో చేస్తున్న ప్రాజెక్టులు చూసి.. ఔరా అనుకునే పరిస్థితి.

ఇంత పెద్ద ఎత్తున నిధుల్ని ఎలా సమీకరిస్తారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సాములోరు చిదిల్వాసంగా నవ్వి.. నారు పోసినోడు నీరు పోయక మానతాడా అన్న చందంగా మాటలు చెప్పారు. ఏదైతేనేం.. ఒక పెద్దపనిషి మొదలుపెట్టినప్పుడు ఆ మాత్రం ప్లానింగ్ ఉండదా అని సరిపెట్టుకునే పరిస్థితి. అలాంటి ఆయన ఒక కొత్త అంశానికి సంబంధించి మీడియాలో కనిపించారు. ఇంతకూ ఆ విషయం ఏమిటంటే.. భద్రత..సైనిక సంక్షేమానికి సంబంధించి జీయర్ ట్రస్ట్ లోపని చేసే ఉద్యోగులు స్వచ్ఛందంగా రూ.10లక్షలు పోగు చేశారని.. వాటిని సైనిక సంక్షేమ నిధికి పంపుతున్నట్లు ప్రకటించారు.

ఇలాంటి మంచి పనిని ఎవరైనా స్వాగతిస్తారు. ఇలాంటి స్ఫూర్తిని అందిపుచ్చుకొని అందరూ కదిలితే సైనిక సంక్షేమ నిధికి భారీగా నిధులు వస్తాయి కూడా. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే స్వాములోరు పెద్దమనిషి తరహాలో కొన్ని మాటలు చెప్పారు. అదేమంటే.. అందరూ దసరా..దీపావళి పండుగల ఖర్చు తగ్గించుకొని ఆ మొత్తాన్ని సైనిక సంక్షేమానికి పంపాల్సిందిగా ఆయన కోరారు. ఇదీ.. మంచి పాయింటే. కానీ.. ఇన్ని మాటలు చెబుతున్న స్వాములోరు ఎంత మొత్తాన్ని సైనిక సంక్షేమానికి ఇచ్చారన్నదే అసలు ప్రశ్న.

అందరిని పండుగలు జరుపుకునే స్థానే.. ఎవరికి వారు వారి స్థోమతకు తగ్గట్లుగా సైనిక సంక్షేమ నిధికి విరాళాలు అందజేయాలన్న స్వాములోరు..వందలాది కోట్ల రూపాయిలతో భారీ ప్రాజెక్టులు చేపట్టే స్వాములోరు..స్వయంగా తన సొంత సొమ్మును సైనికులకు ఎంతిచ్చారన్నదే ప్రశ్న. ఇవాల్టి పరిస్థితుల్లో పండుగలు జరుపుకోవటం కూడా కష్టంగా మారిన పరిస్థితి. ఉన్న‌తాదాయ‌ వర్గాల వారి సంగతిని పక్కన పెడితే.. సామాన్యులు.. మధ్యతరగతి జీవులకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం.. అందుకు తగ్గట్లుగా జీతాలుపెరగని పరిస్థితి.

ఇలాంటి వేళ.. త్యాగాలు చేయాలని కోరటం ఏమిటన్నది ప్రశ్న. అలా అని సామాన్యులు.. మధ్యతరగతి వర్గం వారు త్యాగాలు చేయకూడదని చెప్పటం లేదు. కానీ.. వారిని కోరే ముందు.. అందరికి ఆదర్శంగా ఉండాల్సిన స్వాములోరు సైతం భారీ మొత్తాన్ని సైనిక సంక్షేమానికి విరాళాలు ఇచ్చిన తర్వాత.. ఇలాంటి పిలుపునిస్తే బాగుంటుంది. ఏ కష్టం వచ్చినా.. మరుక్షణం ప్రజల్ని త్యాగాలు చేయాలని చెప్పే రాజకీయ నేతలకు తగ్గట్లే.. స్వాములోళ్లు కూడా త్యాగాల మాట మాట్లాడటమే అసలు ఇబ్బంది. తమకు తాము చేతల్లోచేయని వారు.. కోట్లాది మందిని మాత్రం చేయమని ఎలా చెబుతారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/