Begin typing your search above and press return to search.

ఆయనకు ఝలక్ ఇచ్చిన చిన్మయి

By:  Tupaki Desk   |   2 Dec 2018 7:47 AM GMT
ఆయనకు ఝలక్ ఇచ్చిన చిన్మయి
X
సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఈమధ్య #మీటూ కాంపెయిన్ లో భాగంగా సీనియర్ గేయరచయిత వైరముత్తు పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆయనతో ఆపకుండా తమిళ నటుడు రాధారవిపై కూడా ఆరోపణలు చేసింది. దీనికి స్పందించిన రాధారవి చిన్మయి ఆరోపణలు అవాస్తవాలని కొట్టిపారేశాడు. అంతేకాకుండా తమిళ డబ్బింగ్ కళాకారుల సంఘం నుండి చిన్మయిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

తమిళ డబ్బింగ్ కళాకారుల సంఘానికి రాధారవి అధ్యక్షుడు. కానీ చిన్మయిని తొలగించేందుకు ఆయన చూపించిన కారణం గత రెండేళ్ళుగా ఆమె సభ్యత్వ రుసుము చెల్లించకపోవడమేనన్నారు. దీంతో చిన్మయికి చిర్రెత్తుకొచ్చింది. తను ఈ సంఘంలో శాశ్వత సభ్యురాలినని.. తన సభ్యత్వాన్ని రద్దు చేయడం కుదరని చెప్పింది. అంతటితో ఆగకుండా టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా రాధా రవికి మరో ఝలక్ ఇచ్చింది. మలేషియా ప్రభుత్వం వారు తనను డటోక్ అనే బిరుదుతో సత్కరించారని రాధారవి చెప్పుకుంటారు. అందుకే తన పేరుకు ముందు డటోక్ బిరుదును తగిలిస్తూ ఉంటారు. ఈ విషయంపై చిన్మయి మలేషియా ప్రభుత్వానికి ఒక లేఖ రాసి వాస్తవాలు తెలిపాల్సిందిగా కోరారు.

ఈ లేఖకు స్పందించిన మలేషియా గవర్నమెంట్ రాధారవికి తమ ప్రభుత్వం డటోక్‌ బిరుదును ఇవ్వలేదని.. ఇండియాలో ఒక్క షారూఖ్ ఖాన్ ను మాత్రమే ఈ బిరుదుతో సత్కరించడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఇంకేముంది? చిన్మయి సదరు విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి రాధారవి బండారం బయటపెట్టింది. ఈ విషయంపై రాధారవి ఇంకా స్పందించలేదు. కానీ చిన్మయి ట్వీట్ మాత్రం ఇప్పటికే వైరల్ అయింది.