Begin typing your search above and press return to search.

ట్వీట్ డిలీట్ చేసి సారీ చెప్పిన చిన్మ‌యి

By:  Tupaki Desk   |   28 Jun 2019 6:51 AM GMT
ట్వీట్ డిలీట్ చేసి సారీ చెప్పిన చిన్మ‌యి
X
నిజాన్ని నిర్మోహ‌మాటంగా చెప్ప‌టానికి ద‌మ్ము చాలా ముఖ్యం. అలాంటి వాటి విష‌యంలో త‌న‌కు ట‌న్నులు ట‌న్నులు ఉంద‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే చెప్పేశారు ప్ర‌ముఖ సింగ‌ర్ క‌మ్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి. మీటూ ఉద్య‌మంలో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఎదురైన అనుభ‌వాన్ని చెప్ప‌ట‌మే కాదు.. త‌మిళ సినీరంగంలో పెద్ద‌వాళ్ల‌ను సైతం ఢీ కొనేందుకు వెనుకాడ‌ని ధీరత్వం ఆమె సొంతం.

నిజాన్ని చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడ‌ని ఆమె.. తాజాగా తాను చేసిన త‌ప్పును ఒప్పుకుంటూ.. సారీ చెప్పిన వైనం చూస్తే.. ఆమె తీరు ఎలాంటిదో ఇట్టేఅర్థం కాక మాన‌దు. ఇంత‌కూ జ‌రిగిందేమంటే.. యూపీకి చెందిన ఒక పోలీసు.. ఒక అత్యాచార బాధితురాలిని కోర్కెను తీర్చాల్సిందిగా వేధించిన‌ట్లుగా ఒక పోస్ట్ కు ఆమె స్పందించారు. ఈ మెసేజ్ ను చూసిన ఆమె స్పందిస్తూ.. చ‌ట్టాన్నికాపాడాల్సిన పోలీసే ఇలా ప్ర‌వ‌ర్తిస్తే ఎలా? అంటూ ఆమె ప్ర‌శ్నించారు.

అయితే.. ఈ మెసేజ్ ఫేక్ అన్న విష‌యాన్ని యూపీ పోలీసులు త‌మ అధికార ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా వెల్ల‌డించారు. చిన్మ‌యి ట్వీట్ కు రియాక్ట్ అయిన వారు ఎప్పుడో 2017లో జ‌రిగిన ఘ‌ట‌న గురించి 2019లో ఒక సెల‌బ్రిటీ పోస్ట్ చేయ‌టం అనూహ్యంగా ఉంది. అందులోనూ అది త‌ప్పుడు స‌మాచారం. బాధితురాలు త‌న‌పై అత్యాచారం జ‌రిగింద‌ని త‌ప్పుడు కేసు పెట్టింద‌ని.. ఫిర్యాదు తీసుకున్న ఎస్ ఐ కూడా త‌న‌ను లైంగికంగా వేధించాల‌ని చూసిన‌ట్లుగా చెప్ప‌టం కూడా త‌ప్పేన‌ని పేర్కొన్నారు. ఆమెచేసిన ఫిర్యాదుపై విచార‌ణ జ‌రిపిన త‌ర్వాత ఆమె చేసిన ఆరోప‌ణ‌ల‌న్ని అబ‌ద్ధాలేన‌ని తేలిన‌ట్లు వెల్ల‌డించారు.

దీనిపై చిన్మ‌యి స్పందించారు. ట్వీట్ చేసినందుకు క్ష‌మించాల‌ని కోరారు.త‌న దృష్టికి వ‌చ్చిన ఇలాంటి ఘ‌ట‌న‌ల్ని తాను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాన‌ని.. అలా అయినా బాధితుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని..నిందితుల‌కు శిక్ష ప‌డుతుంద‌న్న‌ది త‌న ఆలోచ‌న‌గా చెప్పారు. త‌న‌ను గుర్తించి స‌మాధానం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఫేక్ న్యూస్ పోస్ట్ ను డిలీట్ చేశారు. త‌ప్పును ఎత్తి చూప‌ట‌మే కాదు.. త‌ప్పు చేసిన‌ప్పుడు అందుకు క్ష‌మించ‌మ‌ని అడిగేందుకు మొహ‌మాట‌ప‌డ‌ని చిన్మ‌యి తీరు ప్ర‌శంసించాల్సిందే.