Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘చి ల సౌ’

By:  Tupaki Desk   |   4 Aug 2018 4:01 AM GMT
మూవీ రివ్యూ: ‘చి ల సౌ’
X
చిత్రం : ‘చి ల సౌ’

నటీనటులు: సుశాంత్ - రుహాని శర్మ - వెన్నెల కిషోర్ - రోహిణి - విద్య - అను హాసన్ - సంజయ్ స్వరూప్ - రాహుల్ రామకృష్ణ - జయప్రకాష్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం: సుకుమార్
నిర్మాతలు: నాగార్జున - జశ్వంత్
రచన - దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్

కథానాయకుడిగా నిలదొక్కుకోవడానికి దశాబ్దం కిందట్నుంచి ప్రయత్నిస్తున్నాడు నాగార్జున అల్లుడు సుశాంత్. కానీ అతనిప్పటిదాకా చేసిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. ఇప్పుడతను నటన నుంచి దర్శకత్వం వైపు అడుగులేసిన రాహుల్ రవీంద్రన్ తో కలిసి ‘చి ల సౌ’ అనే సినిమా చేశాడు. చక్కటి ఫీల్ ఉన్న ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రమైనా సుశాంత్ రాత మార్చేలా ఉందేమో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ (సుశాంత్) చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న ఎగువ మధ్య తరగతి కుర్రాడు. అతడికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు తొందర పడుతుంటారు. కానీ అర్జున్ మాత్రం ఐదేళ్ల తర్వాతే పెళ్లి అంటుంటాడు. మరోవైపు అంజలి (రుహాని) పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న అమ్మాయి. ఆమెకు కొన్ని కారణాల వల్ల ఒక పట్టాన పెళ్లి కుదరక ఇబ్బంది పడుతుంటుంది. వీళ్లిద్దరూ పెళ్లి చూపులకు సిద్ధం కావాల్సి వస్తుంది. అలా అనుకోకుండా కలిసిన ఇద్దరూ తమ తమ ఇబ్బందులు చెప్పుకుంటారు. అర్జున్ కు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని తెలిసి అంజలి అతడికి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతుంది. కానీ అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. అంజలిపై అర్జున్ కు ఆకర్షణ మొదలవుతుంది. అదే సమయంలో అంజలికి ఓ ఇబ్బంది తలెత్తుతుంది. మరి ఈ స్థితిలో అర్జున్ ఏం చేశాడు.. తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి... అర్జున్-అంజలి జంట ఒక్కటైందా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

చెప్పే తీరులో ఆసక్తి ఉండాలే కానీ.. ఎంత చిన్న కథతో అయినా మెప్పించవచ్చు. కంటెంట్ లో దమ్ముండాలే కానీ ఎంత తక్కువ ఖర్చుతో అయినా సినిమా తీసి ఆకట్టుకోవచ్చు. ‘క్షణం’.. ‘పెళ్ళిచూపులు’.. ‘మెంటల్ మదిలో’ లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి. ఈ కోవలో చేర్చే స్థాయి సినిమా కాదు కానీ.. వీటికి దగ్గరగా అనిపించే ఒక మంచి ప్రయత్నం ‘చి ల సౌ’. ఇది కేవలం 24 గంటల్లో ముగిసిపోయే కథ. అలాగని ఇదేమీ థ్రిల్లర్ సినిమా కాదు. ఇందులో ఉత్కంఠభరిత మలుపులేమీ ఉండవు. సినిమా ఏమీ పరుగులు పెట్టేయదు. ఈ చిత్రం చాలా వరకు రెండు ఇళ్లు.. ఒక హాస్పిటల్ సెటప్ లో సాగిపోతుంది. సినిమాలో ఉన్న పాత్రలు కూడా చాలా తక్కువ. అయితేనేం.. దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్.. పరిమిత వనరుల్లోనే ఒక మంచి ప్రయత్నమే చేశాడు. రాతలో.. తీతలో పనితనం చూపించడం ద్వారా ‘చి ల సౌ’తో ప్రేక్షకుల్ని చాలా వరకు ఎంగేజ్ చేయగలిగాడు.

‘చి ల సౌ’ చాలా సింపుల్ గా సాగిపోయే సినిమా. దర్శకుడిగా తన తొలి సినిమాకు రాహుల్ పెద్ద కథనేమీ ఎంచుకోలేదు. కథనంలోనూ హంగామా కోసం ప్రయత్నించలేదు. మన మధ్య కనిపించే వ్యక్తుల నుంచే స్ఫూర్తి పొంది ప్రధాన పాత్రల్ని తీర్చిదద్దుకున్నాడు. మనకు అనుభవమయ్యే ఉదంతాల్నే సన్నివేశాలుగా మార్చుకున్నాడు. ప్రేక్షకులు ఈజీగా రిలేట్ చేసుకునేలా చక్కటి మాటలూ రాసుకున్నాడు. సింపుల్ గా.. సరదాగా కథనాన్ని నడిపిస్తూ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగాడు. ఈ తరం యువతకు పెళ్లి చేసుకోవడం అనేది ఇష్యూగా మారిన నేపథ్యంలో దాని నేపథ్యంలో కథను ఎంచుకోవడం ద్వారా వాళ్లు ఈజీగా సినిమాతో రిలేట్ చేసుకునేలా చేయగలిగాడు. సినిమాలో పెద్దగా డ్రామా ఏమీ కనిపించదు. సన్నివేశాలు ప్రాక్టికల్ గా సాగిపోతాయి.

ఉదాహరణకు పెళ్లిచూపుల కోసం హీరోయిన్ హీరో ఇంటికి వస్తే.. పరిచయం అయ్యీ అవ్వగానే తనకు పెళ్లి ఇష్టం లేదన్న విషయాన్ని చాలా మర్యాదగా చెప్పేస్తాడు. కావాలంటే ఈ విషయం చెప్పడానికి ముందు కొంత డ్రామా నడిపించవచ్చు. కానీ రాహుల్ అలా చేయలేదు. అటువైపు హీరోయిన్ ఒక ట్రికీ పొజిషన్లో ఉంటుంది. ఆమెకు ఈ పెళ్లిచూపులు ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా చాలా కన్విన్సింగ్ గా చెప్పాడు రాహుల్. హీరోయిన్ బ్యాక్ స్టోరీ టచ్ చేసేలా ఉంటుంది. సినిమాలో స్ట్రైకింగ్ గా అనిపించే ఎపిసోడ్ ఇదే. ‘పెళ్ళిచూపులు’ సినిమా తరహాలోనే ఒక గదిలో కూర్చుని అబ్బాయి-అమ్మాయి పరిచయం చేసుకోవడం.. వారి మధ్య సంభాషణ.. వారి నేపథ్యాలు చూపించడంతోనే ప్రథమార్ధాన్ని సింపుల్ గా ముగించేశాడు రాహుల్. ఇక ద్వితీయార్ధంలో వాళ్లను గది నుంచి బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద.. ఇంకో ఇంటికి.. హాస్పిటల్ కు తిప్పాడు. మధ్యలో దొంగ-హత్య-పోలీస్ స్టేషన్.. ఈ సెటప్ లో నడిపిన ఒక ఉపకథ సరదాగా సాగి రిలీఫ్ ఇస్తుంది. అలాగే ప్రథమార్ధంలో.. ద్వితీయార్ధంలో కథ కొంచెం ఫ్లాట్ గా సాగిపోతున్నపుడు వెన్నెల కిషోర్ హ్యాండ్ కూడా పడింది. దీంతో నవ్వులకు ఢోకా లేకపోయింది.

ఐతే ‘చి ల సౌ’కు అతి పెద్ద సమస్య నరేషనే. సన్నివేశాల్ని మరీ నెమ్మదిగా నడిపించాడు రాహుల్. కొన్ని సన్నివేశాలు సాగతీతగా.. రిపిటీటీవ్ గా అనిపిస్తాయి. సినిమాలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇంకొంచెం బలంగా ఉండాల్సింది. హీరోయిన్ పాత్ర బాగుంది కానీ.. ఆమె హీరోను ఒప్పుకునే విషయంలో మరీ మొండిగా ఉండటం కన్విన్సింగ్ గా అనిపించదు. మిగతా సినిమా అంతటా కనిపించే సహజత్వం ఈ ఒక్క విషయంలో మాత్రం మిస్సయింది. హీరోయిన్ పాత్రను ప్రత్యేకంగా మలిచిన దర్శకుడు.. హీరో పాత్ర విషయంలోనూ శ్రద్ధ పెడితే.. సినిమాలో డెప్త్ పెరిగేది. ఈ సినిమా నడత ప్రకారం చూస్తే.. ఇది క్లాస్ టచ్ ఉన్న సినిమాల్ని ఇష్టపడే వారికే నచ్చే అవకాశముంది. చాలా చిన్న సెటప్ లో సాగిపోయే ఈ చిత్రం కొంచెం భారీతనం.. మలుపులు కోరుకునే వాళ్లకు రుచిస్తుందా అన్నది సందేహమే. ఓవరాల్ గా చెప్పాలంటే.. ‘చి ల సౌ’ క్లాస్ టచ్ ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్లు ఇష్టపడేవాళ్లను ఓకే అనిపిస్తుంది.

నటీనటులు:

సుశాంత్ ఇప్పటిదాకా చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తాడు. తొలిసారి అతను పాజిటివ్ ఇంప్రెషన్ వేస్తాడు. పక్కింటి కుర్రాడి పాత్రలో అతను సులువుగానే ఒదిగిపోయాడు. హీరోలా కాకుండా ఒక పాత్రధారిగా మాత్రమే సుశాంత్ కనిపిస్తాడు. హీరోయిజం లేకపోవడమే కాదు.. హీరోయిన్ పాత్ర తనను డామినేట్ చేసేలా ఉన్నా కూడా అతనీ సినిమా చేయడం అభినందించదగ్గ విషయమే. హీరోయిన్ రుహాని శర్మ చాలా ఆత్మవిశ్వాసంతో నటించింది. లుక్ పరంగా ఆమె సాధారణంగానే కనిపిస్తుంది. కానీ నటనతో మెప్పిస్తుంది. సినిమాలో ఆమెదే అత్యంత కీలక పాత్ర కావడం విశేషం. హీరోయిన్ తల్లిగా రోహిణి తక్కువ సన్నివేశాల్లోనే కనిపించినా.. చక్కటి నటనతో ఆకట్టుకుంది. ఆమెది కూడా కీలక పాత్రే. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశాడు. అతను కనిపించే ప్రతి సన్నివేశంలోనూ నవ్విస్తాడు. రాహుల్ రామకృష్ణ.. విద్య.. అను హాసన్.. జయప్రకాష్.. వీళ్లంతా బాగానే చేశారు.

సాంకేతికవర్గం:

ఇలాంటి సినిమాలకు సంగీతం అందించడానికి తాను మంచి ఛాయిస్ అని ప్రశాంత్ విహారి మరోసారి రుజువు చేశాడు. పాటలకు ఇందులో పెద్దగా ప్రాధాన్యం లేదు. ఐతే ఒక మంచి మెలోడీతో అతను తన ముద్ర చూపించాడు. నేపథ్య సంగీతంతో ఆద్యంతం ఒక ఫీల్ కలిగించడంలో విజయవంతమయ్యాడు. సుకుమార్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. పరిమితమైన లొకేషన్లలోనే మొనాటనీ రాకుండా సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. చాలా తక్కువ ఖర్చుతో సినిమాను ముగించిన విషయం తెరపై కనిపిస్తుంది. ఈ విషయంలో ముందు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు అభినందనలు చెప్పాలి. అతను ఈ ట్రెండుకు తగ్గ దర్శకుడినని చాటుకున్నాడు. రచనలో తన బలాన్ని చూపించిన రాహుల్.. దర్శకుడిగా కూడా ఓకే అనిపించాడు.

చివరగా: చి ల సౌ.. నెమ్మదిగానే మెప్పిస్తుంది

రేటింగ్-2.75/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre