Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కరోనా సాంగ్

By:  Tupaki Desk   |   26 March 2020 5:40 AM GMT
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కరోనా సాంగ్
X
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకీ మృతుల సంఖ్య, బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు అయోమయానికి గురవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు కరోనా పేరు వింటేనే భయపడిపోతున్నారు. సాధారణ జలుబు, తుమ్ములు, దగ్గులు వచ్చినా కూడా కరోనా సోకిందేమో అని కంగారు పడిపోతున్నారు. ఇళ్లకే పరిమితమైన జనాలు టీవీ, సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గి నెట్టింట్లో ట్రాఫిక్ పెరిగింది. ఈ నేపథ్యంలో సౌండ్స్ వర్త్ వాళ్లు కరోనాపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. పాట రూపంలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా పై ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనతో పాటు మన పక్కన ఉండే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని ఈ పాట ద్వారా వివరంగా తెలియజేసారు.

చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా... ప్రజలందరి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయిరా బాధ్యతగా నడుచుకో నువ్వే భగవంతుడివిరా...యుద్ధానికి సిద్ధమా రోగం తరిమేద్ధమా ఆయుధాలు లేవురా హృదయం ఉంటే చాలు రా... కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా, కాలం మారేదాక ఓపికైతే పట్టారా...నీకోసం నాకోసం నీ నా పిల్లల కోసం పగలనక రాత్రనక సైనుకల్లే సాగినారు...ప్రాణాలు పనం పెట్టి మన కోసం పొరుతుంటే బాధ్యత లేకుండా మనం వారికి బరువవుదామా..అరే లోకమంటే వేరు కాదు నువ్వే ఆ లోకంరా నీ బతుకు చల్లగుంటే లోకానికి సలవురా... అంటూ సాగే ఈ పాట విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆ పాటను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విడుదలైన తక్కువ టైంలోనే ఎక్కువ మందికి చేరువైంది.