Begin typing your search above and press return to search.

చెన్నకేశవరెడ్డి కలెక్షన్లు ఫేక్?

By:  Tupaki Desk   |   12 Oct 2022 2:30 AM GMT
చెన్నకేశవరెడ్డి కలెక్షన్లు ఫేక్?
X
ఈ రోజుల్లో ఒక సినిమా ఒరిజినల్ కలెక్షన్లు ఎంత అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. సోషల్ మీడియాలో, బాక్సాఫీస్ వెబ్ సైట్లలో ఎవరికి నచ్చిన ఫిగర్లు వాళ్లు వేసుకుంటున్నారు. ఒక పెద్ద సినిమాకు సంబంధించి కలెక్షన్ల గురించి ఆ చిత్రాన్ని పంపిణీ చేసిన అగ్ర నిర్మాత దిల్ రాజును అడిగితే..

డిస్ట్రిబ్యూటర్‌గా తాను ఒక ఫిగర్ ఇస్తే నిర్మాతలు వాళ్లకు నచ్చినట్లు కలెక్షన్లు వేసుకున్నారని చెప్పడాన్ని బట్టి టాలీవుడ్లో ఫేక్ వసూళ్ల వ్యవహారం ఎలా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. కొత్త సినిమాలకు హైప్ తేవడానికి, సినిమా బ్లాక్‌బస్టర్ అని ఒప్పించడానికి ఇలా చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడో రిలీజైన పాత సినిమాలను రీరిలీజ్ చేస్తూ వాటి వసూళ్ల విషయంలోనూ ఫేక్ చేస్తున్నారనే ఆరోపణలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. రీ రిలీజ్ సినిమాల్లోనూ రికార్డుల కోసం అభిమానులు కొట్టేసుకుంటుండడం ఈ పరిస్థితికి కారణం కావచ్చు.

ఆగస్టులో మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 'పోకిరి' సినిమా స్పెషల్ షోలు, వసూళ్ల విషయంలో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుకు 'జల్సా' సినిమాను రీ రిలీజ్ చేయగా.. షోలు, వసూళ్ల విషయంలో 'పోకిరి' రికార్డులన్నీ బద్దలైపోయినట్లుగా ప్రకటనలు వచ్చాయి. ఆ రెండు చిత్రాల షోలకు నెలకొన్న డిమాండ్, హంగామా చూశాక షోలు, వసూళ్ల విషయంలో ఎవరికీ సందేహాలు రాలేదు. ఐతే ఈ మధ్య నందమూరి బాలకృష్ణ సినిమా 'చెన్నకేశవరెడ్డి'కి కూడా స్పెషల్ షోలు వేయగా..

దీనికి ముందు షోల సంఖ్య పరంగా కొత్త రికార్డు నమోదైనట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. తాజాగా కలెక్షన్ల పరంగానూ కొత్త రికార్డ్ అంటూ రూ.5.39 కోట్ల గ్రాస్ ప్రకటించారు. ఐతే ఈ సినిమాకు ఈ స్థాయిలో వసూలయ్యే అవకాశమే లేదన్నది ట్రేడ్ వర్గాల మాట. ఎందుకంటే 'చెన్నకేశవరెడ్డి'కి యుఎస్‌లో బాగా హంగామా కనిపించింది.

ఎక్కువ షోలు వేశారు. వాటికి డిమాండ్ కూడా బాగానే ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో పోకిరి, జల్సా సినిమాలకు కనిపించిన సందడి ఈ చిత్రానికి లేదు. చాలా చోట్ల షోలు ఫుల్ కాలేదు. నిర్మాత ప్రకటించిన స్థాయిలో అయితే షోలు పడ్డట్లు కనిపించలేదు. అలాంటపుడు ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయని..

జల్సా కలెక్షన్లను పెద్ద మార్జిన్‌తో దాటేసిందని చెప్పడం అతిశయోక్తిగానే కనిపిస్తోంది. ఈ సినిమాకు వచ్చిన షేర్‌ను 'బసవతారకం ఆసుపత్రికి ఇస్తున్నట్లు సురేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఆ చెక్కు మీద వేసిన ఫిగర్‌ను సోషల్ మీడియాకు వెల్లడిస్తే ఈ వసూళ్లు నిజం అనే విషయం అందరికీ అర్థమవుతుంది. మరి సురేష్ ఆ పని చేస్తారా అన్నది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.