Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'చెక్'

By:  Tupaki Desk   |   27 Feb 2021 6:34 AM GMT
మూవీ రివ్యూ: చెక్
X
చిత్రం:: ‘చెక్’

నటీనటులు: నితిన్-రకుల్ ప్రీత్-ప్రియ ప్రకాష్ వారియర్-సాయిచంద్-మురళీ శర్మ-సంపత్-కృష్ణచైతన్య-పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: కళ్యాణి మాలిక్
ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాస్తవ్
మాటలు: నరేష్ రెడ్డి
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి

విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి నుంచి కొంత విరామం తర్వాత వచ్చిన కొత్త సినిమా ‘చెక్’. నితిన్ హీరోగా ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఆదిత్య (నితిన్) 40 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఉగ్రవాద దాడి కేసులో దోషిగా తేలి ఉరిశిక్ష పడ్డ ఖైదీ. కానీ అతడికి ఆ నేరంలో ఎలాంటి పాత్ర ఉండదు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కేసులో చిక్కుకుంటాడు. కానీ అతడి వాదన కోర్టులో నిలవదు. తన తరఫున వాదించడానికి కూడా లాయర్లు ముందుకు రారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ కేసును టేకప్ చేస్తుంది మానస (రకుల్ ప్రీత్) అనే లాయర్. ముందు ఆదిత్య తప్పు చేశాడనే అనుకున్న మానస.. తర్వాత అతను నిర్దోషి అని అర్థం చేసుకుంటుంది. తన కోసం పోరాడుతుంది. మరోవైపు జైల్లో శ్రీమన్నారాయణ (సాయిచంద్) అనే చెస్ క్రీడాకారుడి దగ్గర ఆ ఆట నేర్చుకున్న ఆదిత్య.. తన అసాధారణ ప్రతిభతో ఆయన్ని మెప్పిస్తాడు. శ్రీమన్నారాయణ జైలు నుంచి బయటికి వచ్చాక ఆదిత్యకు బయట చెస్ టోర్నీల్లో పోటీ పడేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఇలా ఆడి మంచి పేరు సంపాదిస్తాడు. ఇలా మొదలైన ఆదిత్య చెస్ ప్రయాణం ఎక్కడ దాకా వెళ్లింది.. అతణ్ని బయటికి తెచ్చేందుకు మానస చేసిన ప్రయత్నం ఏ మేర ఫలించింది. ఆదిత్య జీవితం ఏ తీరానికి చేరింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

గత కొన్నేళ్లలో తెలుగు సినిమా ఎంతో మారింది. ఎన్నో కొత్త కథలు వచ్చాయి. మరెన్నో ప్రయోగాలు జరిగాయి. కానీ రెండు దశాబ్దాల కిందట తెలుగు సినిమా ఒక మూసలో సాగిపోతున్న సమయంలోనే ‘ఐతే’ లాంటి వైవిధ్యమైన చిత్రంతో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న దర్శకుడు. ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన ‘అనుకోకుండా ఒక రోజు’ తనపై ఇంకా అంచనాలు పెంచింది. కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్నందుకున్నాయన్నది పక్కన పెడితే.. ఇప్పటిదాకా యేలేటి చేసిన ప్రతి సినిమా ఒక కొత్త ప్రయత్నమే. ఇప్పుడు ‘చెక్’తో ఆయన మరో భిన్నమైన ప్రయత్నమే చేశాడు. చేయని నేరానికి ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. తన తెలివితేటలతో ఎలా జైలు నుంచి బయటికి వచ్చాడనే పాయింట్ కు చెస్ గేమ్ నేపథ్యాన్ని ఎంచుకుని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాలని చూశాడు. కానీ ఈ ప్రయత్నంలో ఆయన కొంతమేరే విజయవంతం అయ్యాడు. చెస్ నేపథ్యంలో యేలేటి సినిమా అనగానే ఆ ఆటలో ఉండే ‘బ్రిలియన్స్’ అంతా యేలేటి స్క్రీన్ ప్లే రూపంలో తెరపైకి ట్రాన్స్ లేట్ అవుతుందని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ అది జరగలేదు. ప్లాట్ బాగున్నా.. హాలీవుడ్ క్లాసిక్ ‘శ్వశాంక్ రిడెంప్షన్’ స్ఫూర్తితో రాసుకున్న ట్విస్టు.. చివర్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ప్రేక్షకులను థ్రిల్ చేసినా.. అక్కడిదాకా అనుకున్నంత ఆసక్తికరంగా కథను నడిపించడంలో యేలేటి తడబడ్డాడు.

తన గత సినిమాలతో యేలేటి నెలకొల్పిన ప్రమాణాలే ‘చెక్’కు మైనస్. యేలేటి సినిమాలంటే బిగి తప్పని స్క్రీన్ ప్లేని ఆశిస్తాం. ఎక్కడా లూజ్ ఎండ్స్ లేకుండా.. చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో లాజికల్ గా.. రియలిస్టిగ్గా చూపించి లోపాల్లేని స్క్రీన్ ప్లే రాయడంలో ఆయన సిద్ధహస్తుడు. ‘ఐతే’లో కిడ్నాప్ డ్రామా అయినా.. ‘అనుకోకుండా ఒక రోజు’లో మూఢ భక్తితో విపరీతంగా ప్రవర్తించే సైకో బృందానికి సంబంధించిన ఎపిసోడ్ అయినా.. వినడానికి నమ్మశక్యంగా అనిపించవు. కానీ తెరపై వాటిని యేలేటి ఎంతో ఎంతో పకడ్బందీగా ప్రెజెంట్ చేసి ప్రేక్షకులను నమ్మిస్తాడు. కానీ ‘చెక్’లో అలా కీలకమైన విషయాల్లో ప్రేక్షకులను కన్విన్స్ చేయడంలో యేలేటి విఫలమయ్యాడు. ‘చెక్’లో అత్యంత ముఖ్యమైన విషయమే లాజికల్ గా అనిపించదు. తన తెలివి తేటలతో చిన్న చిన్న సైబర్ క్రైమ్స్ చేసుకునే హీరోకు ఉగ్రవాదిగా ముద్రపడి ఉరిశిక్ష పడటం వాస్తవికంగా అనిపించదు. అతను ఈ కేసులో ఇరుక్కునేందుకు దారి తీసే పరిస్థితులు నమ్మశక్యంగా లేవు. ఒక వ్యక్తికి ఉరి శిక్ష వేయడం అంటే.. అంత సాధారణంగా జరిగిపోదు. సాక్ష్యాలు పక్కాగా ఉండాలి. ఆ వ్యవహారం అంతా ఎంతో పకడ్బందీగా అనిపించాలి. కానీ ‘చెక్’లో చాలా విషయాలు పైపైన చూపించేసి హీరోనుదోషిగా నిర్ధారించేసినట్లు అనిపిస్తుంది. అయ్యో హీరో అన్యాయంగా ఇరుక్కున్నాడే.. అతణ్ని ఇలా ఇరికించేశారేంటి అనే ఫీలింగే ప్రేక్షకుడికి కలగదు. హీరో ఎంత బలంగా ఇరుక్కుంటే అతడి మీద సానుభూతి కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అతను ఎలా బయటపడతాడనే ఉత్కంఠ రేగుతుంది. ‘చెక్’లో ఆ ఉత్కంఠే మిస్ అయింది.

‘చెక్’లో ప్రేక్షకులను అలరించే అంశాలు లేవనేమీ కాదు. ప్రథమార్ధంలో ‘చెక్’ చాలా వరకు ఎంగేజింగ్ గానే సాగుతుంది. ఆరంభ సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. నేరుగా ఉరి శిక్ష పడ్డ ఉగ్రవాదిగా హీరోను పరిచయం చేయడంతో దీని వెనుక కథేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి పుట్టేలా సినిమా మొదలవుతుంది. హీరోకు మొదట పరిస్థితులన్నీ ప్రతికూలంగా.. అన్ని దారులూ మూసుకుపోయినట్లు చూపించి.... ఆ తర్వాత అతడి ఒక్కోటి ఓపెన్ చేయడంతో ప్రేక్షకులు కథలో ఇన్వాల్వ్ అవుతారు. హీరో చదరంగం వైపు ఆకర్షితుడై ఆ ఆటలో నైపుణ్యం సాధించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోను చీకటి గదిలో వేస్తే.. కిటికీ గళ్ల ప్రతిబింబాన్నే చెస్ బోర్డుగా ఊహించుకుని అతను ఆటలో నేర్పు సాధించే సన్నివేశంలో యేలేటి మార్కు కనిపిస్తుంది. జైలు లోపల హీరోను కొందరు కవ్వించడం.. అతను వారిపై ఎదురు తిరగడం... ఈ క్రమంలో ఫైట్లు.. రొటీన్ కమర్షియల్ హంగుల్లా కనిపిస్తాయి కానీ.. చెస్ తో ముడిపడ్డ సన్నివేశాలు మాత్రం కొత్తగా తోస్తాయి.

ఐతే హీరో ఎలా ఈ కేసులో ఇరుక్కున్నాడో తెలియజెప్పే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం ఉస్సూరుమనిపిస్తుంది. ప్రియ ప్రకాష్ వారియర్ పాత్రను పేలవంగా తీర్చిదిద్దడంతో దానికి సంబంధించిన ఎపిసోడ్ తేలిపోయింది. యేలేటి నుంచి ఇలాంటి లూజ్ ఎండ్ ఊహించం. ఐతే మళ్లీ వర్తమానంలోకి వచ్చాక కథనం బాగానే సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంపై ఆసక్తి పెంచుతుంది. కానీ ఆ తర్వాత యేలేటి అనుకున్నంత ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోయాడు. ద్వితీయార్ధంలో కథ ముందుకు కదలక..జైల్లో సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపించి ప్రేక్షకుల్లో అసహనం మొదలవుతుంది. హీరో చదరంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోే సన్నివేశాలు ఓవర్ ద టాప్ అనిపిస్తాయి. అవి కూడా కథనాన్ని ఆసక్తికరంగా మార్చలేకపోయాయి. ఇక ముగింపు ఎఫ్పుడొస్తుందా అని ఎదురు చూడటమే మిగులుతుంది. క్లైమాక్స్ ట్విస్టు మీద పూర్తిగా డిపెండ్ అయిపోయిన దర్శకుడు... దానికి ముందు సన్నివేశాలను తేల్చేశాడు. ముగింపులో మలుపు థ్రిల్ చేసినా.. ఈ కథకు ఇది సరైన ముగింపేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ కథను అసంపూర్తిగా వదిలేసిన భావన కలుగుతుంది. అయినప్పటికీ ఈ చిత్రానికి క్లైమాక్సే హైలైట్. ఓవరాల్ గా చూస్తే ‘చెక్’లో కొన్ని మూమెంట్స్ అయితే ఉన్నాయి కానీ.. ఇది యేలేటి నుంచి ఆశించే సినిమా అయితే కాదు. ఆయన గేమ్‌ లో ఓడిపోయాడని చెప్పలేం.. అలాగని గెలిచినట్లూ కాదు. చివర్లో ప్లే చేసిన ట్విస్టుతో త్రుటిలో ఓటమి నుంచి బయటపడి.. డ్రా చేసుకోగలిగాడంతే.

నటీనటులు:

నితిన్ ఆదిత్య పాత్రకు చక్కగా సరిపోయాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. పరిణతితో కూడిన నటనతో ఆకట్టుకున్నాడు. అతను ఇలాంటి ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో చక్కటి హావభావాలు ఇచ్చాడు. రకుల్ ప్రీత్ కూడా ఇందులో కొత్తగా కనిపించింది. కానీ ఆమె లుక్ ముందున్నంత ఆకర్షణీయంగా లేదు. తన పాత్ర జస్ట్ ఓకే అనిపిస్తుందంతే. ప్రియ ప్రకాష్ వారియర్ ఏ రకంగానూ ఆకట్టుకోదు. ఆ పాత్రను మరీ పేలవంగా తీర్చిదిద్దాడు యేలేటి. కనిపించిన కాసేపు గ్లామర్ ఎటాక్ చేయడం తప్పితే ప్రియ ఇందులో చేసిందేమీ లేదు. సినిమాలో అందరిలోకి.. హీరో నితిన్ కంటే కూడా బాగా నటించిందంటే సాయిచందే. సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రతి సినిమాతోనూ ఆశ్చర్యపరుస్తున్న ఆయన శ్రీమన్నారాయణ పాత్రలో టాప్ క్లాస్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇంకెవరూ ఆ పాత్రను ఇంతకంటే బాగా చేయలేరు అనిపించాడు. సంపత్.. మురళీ శర్మ పాత్రలు.. వారి నటన మామూలే. పోసాని ఓకే.

సాంకేతికవర్గం:

సినిమాలో సాంకేతికంగా పెద్ద సానుకూలత కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం. ప్రతి సన్నివేశాన్నీ ఆర్ఆర్ తో ఎలివేట్ చేయడానికి అతను ప్రయత్నించాడు. నేపథ్య సంగీతం ద్వారా ఒక మూడ్ క్రియేట్ చేయడానికి కృషి చేశాడు. సినిమాలోని ఏకైక పాట పర్వాలేదనిపిస్తుంది. రాహుల్ శ్రీవాస్తవ్ ఛాయాగ్రహణం బాగుంది. ఎక్కువ సన్నివేశాలు జైలు గోడల మధ్యే సాగినా.. మరీ మొనాటనస్ అనిపించకుండా కెమెరా పనితనం చూపించాడు. భవ్య వారి నిర్మాణ విలువలకు ఢోకా లేదు. నరేష్ రెడ్డి మాటల్లో మెరుపులున్నాయి. ముఖ్యంగా చదరంగంలోని జంతువుల గురించి చెప్పే మాటలు.. హీరో ఫిలాసఫీకి సంబంధించిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక దర్శకుడు యేలేటి విషయానికొస్తే.. ఆయన తన అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు. యేలేటి ఎంచుకున్న పాయింట్ భిన్నమైందే. కానీ దాన్ని అనుకున్నంత ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయలేకపోయాడు. కొన్ని సన్నివేశాల్లో.. క్లైమాక్స్ లో యేలేటి ముద్ర కనిపించినా.. ఓవరాల్ గా ఆయన్నుంచి ఆశించే బ్రిలియన్స్ సినిమాలో మిస్సయింది. జైల్లోనే చాలా వరకు కథను నడిపించేలా స్క్రిప్టు రాసుకోవడంతో ఆయన తనను తాను బంధనాలు వేసుకున్నట్లయింది. స్క్రీన్ ప్లేతో వైవిధ్యం చూపించడానికి.. ఉత్కంఠ రేపడానికి అవకాశం లేకపోయింది.

చివరగా: చెక్.. గేమ్ డ్రా

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre