Begin typing your search above and press return to search.

యువతిని మోసగించిన రచయితపై కేసు!

By:  Tupaki Desk   |   1 Jun 2019 7:26 AM GMT
యువతిని మోసగించిన రచయితపై కేసు!
X
సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ రచయిత ఓ అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకొని మోసం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో నివసించే యర్రంశెట్టి రమణగౌతం (28) బుల్లితెరతోపాటు వెండితెరకు కథలు రాస్తూ ఫిలింనగర్ లో ఆరేళ్లుగా రచయితగా జీవిస్తుండేవాడని పోలీసులు తెలిపారు.

ఇతడికి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎన్జీబీనగర్ లో నివసించే యువతి (23)తో పరిచయం అయ్యిందని వివరించారు.. సినిమాల మీద ప్రేమతో ఆ యువతి స్టూడియోల చుట్టూ తిరుగుతుండగా.. రమణతో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసిందన్నారు. సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని రమణ .. సదురు యువతిని నమ్మించాడని.. 2016లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం ఆ తరువాత సహజీవనానికి దారితీసిందని పేర్కొన్నారు.

యువతికి ఉన్నత ఉద్యోగ అవకాశం రావడంతో దుబాయ్, సింగపూర్, బెహ్రయిన్ దేశాలకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. అక్కడ సంపాదించిన డబ్బుని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రమణకు పంపిందని.. 2017లో ఇద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నట్టు వివరించారు. అయితే ఇటీవల ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో రమణ ఒప్పుకోలేదని పోలీసులు పేర్కొన్నారు.

రమణ పెళ్లికి నిరాకరించాడని సదురు యువతి ఆత్మహత్యాయత్నం చేసిందని.. సమాచారం అందుకున్న పోలీసులు రమణను స్టేషన్ కు పిలిపించి పెళ్లి చేసుకోమని సూచించామని తెలిపారు. దీంతో అదేరోజు రాత్రి అయిష్టంగానే రమణ ఓ గుడిలో సదురు యువతికి తాళి కట్టాడని.. సిగరేట్ తాగి వస్తానని చెప్పి అటు నుంచి అటే బయటకు వెళ్లి ఉడాయించాడని తెలిపారు.

అలా మొదటి రాత్రి రోజే తెల్లవారుజామున ఫోన్ చేసి నువ్ నాకు వద్దు అంటూ విడాకులు తీసుకుందామని రమణ సదురు యువతికి షాక్ ఇచ్చాడని పోలీసులు వివరించారు.. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. మోసగించిన రమణపై చర్యలు తీసుకోవాలని కోరిందని.. ఈ మేరకు రమణపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.