Begin typing your search above and press return to search.

రేపు ఈడీ విచారణకు హాజరుకానున్న చార్మీ..!

By:  Tupaki Desk   |   1 Sept 2021 10:00 PM IST
రేపు ఈడీ విచారణకు హాజరుకానున్న చార్మీ..!
X
టాలీవుడ్ డ్రగ్స్ కేసు నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ సంచలనంగా మారింది. ఈ కేసులో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. పలువురు సినీ ప్రముఖులతో సహా 12 మందికి నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ల ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ అధికారులు ఈ విచారణ చేస్తున్నారు. మంగళవారం టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ను సుమారు 10 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. ఈ క్రమంలో రేపు శుక్రవారం నటి చార్మీ కౌర్ ఈడీ ఎదుట హాజరు కానున్నారు.

సెప్టెంబర్ 2న విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు ఇప్పటికే చార్మీ కి నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు చార్మి ని పిలిచినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో చార్మి ని ప్రశ్నించనున్న ఈడీ.. 2015 నుంచి ఇప్పటి వరకు ఆమె బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు సమర్పించాల్సిందిగా కోరినట్లు సమాచారం. వీటి ద్వారా కెల్విన్ - చార్మి మధ్య ఆర్ధిక లావాదేవిలు జరిగాయా లేదా అనే విషయాలపై అధికారులు ఆరా తీయనున్నారు. పూరీ మాదిరిగానే చార్మీ కూడా తన చార్టెడ్ అకౌంటెంట్ తో కలిసి ఈ ఎంక్వైరీకి వచ్చే అవకాశం ఉంది.

కాగా, మనీ లాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసిన వారిలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ - రానా దగ్గుబాటి - రవితేజ మరియు అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌ - నవదీప్‌ మరియు ఎఫ్‌ క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ - ముమైత్ ఖాన్‌ - తనీష్‌ - నందు - తరుణ్‌ వంటి వారు ఉన్నారు. రాబోయే రోజుల్లో వీరందరూ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ విచారణలో ఏవైనా ఆధారాలు లభిస్తే తెలంగాణ ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చిన డ్రగ్స్ కేసు.. ఈడీ దర్యాప్తు ద్వారా వీరి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఏమి జరుగుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.