Begin typing your search above and press return to search.

పూరితో ‘కనెక్షన్’ గురించి ఛార్మి జవాబిది

By:  Tupaki Desk   |   29 April 2018 2:52 PM IST
పూరితో ‘కనెక్షన్’ గురించి ఛార్మి జవాబిది
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో ‘జ్యోతిలక్ష్మీ’ ముందు వరకు సినిమానే చేయలేదు ఛార్మి. కానీ వాళ్లిద్దరూ ఆ సినిమా కంటే ముందు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ‘జ్యోతిలక్ష్మీ’లో ఛార్మిని నిర్మాణ భాగస్వామిగా కూడా చేశాడు పూరి. ఆ తర్వాత పూరి తీస్తున్న సినిమాల ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తోంది ఛార్మి. అంతే కాక ‘పూరీ కనెక్ట్స్’ పేరుతో పెట్టిన కాస్టింగ్ కంపెనీ బాధ్యత కూడా ఆమే చూస్తోంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ‘మెహబూబా’కు ప్రొడక్షన్లో అన్నీ తానై వ్యవహరించింది ఛార్మి. ఈ నేపథ్యంలో పూరితో ఛార్మి బంధం గురించి ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ వషయంలో జనాల్లోనూ అనేక సందేహాలున్నాయి. దీని గురించి ఛార్మి దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. పూరితో తనది ప్రొఫెషనల్ బంధం అని.. తమ ఇద్దరం మంచి స్నేహితులమని.. తమ గురించి ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని ఆమె స్పష్టం చేసింది.

‘‘పూరి గారు ఫేమస్‌. నేనూ ఫేమస్. కాబట్టి మా గురించి జనాలు ఏవేవో అనుకుంటారు. అదే నేను అబ్బాయి అయి ఉండి ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తుంటే అలా అనుకోరు కదా. నేను ఒక హీరోయిన్‌ ని కాకున్నా కూడా అలా అనుకోరు కదా. ఇప్పుడు నేనేం చెప్పినా పట్టించుకోరు.మాట్లాడుకునేది మాట్లాడుకుంటూనే∙ఉంటారు. అందుకే వివరణ ఇవ్వడం మానేశాను. నాకు సంబంధించిన ఖర్చులు సొసైటీ కానీ.. జనాలు కానీ ఇవ్వట్లేదు. అన్నీ నేనే చూసుకోవాలి. నా జీవితం నేనే బతకాలి. వాళ్లు ఇలా అనుకుంటున్నారు... వీళ్లు ఇలా అనుకుంటున్నారని నా పనులన్నీ ఆపేసికూర్చోలేను. మీ ఇష్టం అని వదిలేయడం తప్ప ఏమీ చేయలేదు. ఇతరుల జీవితాల గురించి ప్రశ్నలు వేసుకుని జవాబులు ఆశించడం మానుకోవాలి. ఆ ఆరాటాన్ని వదిలించుకుంటే అందరూ పైకి వస్తారు. పనిపై దృష్టిపెడితే ఎక్కడికో వెళ్లిపోతారు. సాయంత్రం అవ్వగానే వాళ్ల గురించి.. వీళ్ల గురించి సొల్లు కబుర్లు చెప్పుకునేవాళ్లు జీవితంలో పైకి రారు’’ అంటూ పూరి స్టయిల్లోనే క్లాస్ పీకింది ఛార్మి.