Begin typing your search above and press return to search.

గోవాలో బ‌ర్త్‌ డే బోయ్ పూరి.. ఛార్మి ఏం చేసిందంటే!

By:  Tupaki Desk   |   28 Sept 2019 1:29 PM IST
గోవాలో బ‌ర్త్‌ డే బోయ్ పూరి.. ఛార్మి ఏం చేసిందంటే!
X
సినీ ఇండ‌స్ట్రీలో ఎత్తు ప‌ల్లాలు స‌హ‌జం. ఎప్పుడు ఎవ‌రిని పైకెత్తెస్తుందో.. ఎప్పుడు ఎవ‌రిని కింద‌కి దించేస్తుందో ఎవ్వ‌రికీ తెలియ‌దు. టైమ్ వ‌చ్చే వ‌ర‌కు ఓపిగ్గా వేచి చూడాల్సిందే. కొంద‌రికి జీవితాలు క‌రిగిపోతుంటాయి. ఇంకొంద‌రికి ఆరంభ‌మే క‌లిసి రావొచ్చు. మ‌రికొంద‌రికి మ‌ధ్య‌లో రాహుకాలం దాపురించ‌నూ వ‌చ్చు.

స్టార్ డైరెక్ట‌ర్ పూరీకి ఎదురైన స‌న్నివేశం పూర్తిగా వేరు. ఇండస్ట్రీలో స్పీడ్ డైరెక్ట‌ర్ గా పేరున్న పూరి జ‌గ‌న్నాథ్ కు ఇండ‌స్ట్రీ హిట్లు ఇచ్చిన ట్రాక్ రికార్డుంది. అయితే అది నిన్న మొన్న‌టి మాట.. కాలం మారింది. గ‌త కొంత కాలంగా అత‌న్ని హిట్ అనే మాట దోబూచులాడింది. ఇటీవ‌లే `ఇస్మార్ట్ శంక‌ర్‌` ఆ వెలితిని తీరుస్తూ పూరీకి పూర్వ‌వైభ‌వాన్ని అందించింది. బ్లాక్ బ‌స్ట‌ర్ తో పూరీ రీబూట్ అయ్యాడు. మ‌ళ్లీ విజ‌యాల బాట‌ప‌ట్టాడు.

నేడు పూరీ పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానులు మ‌రోసారి పూరి గ‌తాన్ని నెమ‌రు వేసుకుంటున్నారు. ప‌రిశ్ర‌మ అగ్ర ద‌ర్శ‌కుడిగా ఓ వెలుగు వెలిగి వేరొక‌రిని న‌మ్మి త‌న‌కు ఉన్న‌వ‌న్నీ పోగొట్టుకుని అదే టైమ్ లో తిరిగి ప‌రిశ్ర‌మ సాయంతోనే తిరిగి సంపాదించుకుని మ‌ళ్లీ ఫామ్ కోల్పోయి.. అబ్బో అత‌డి హిస్ట‌రీనే వేరు. తిరిగి ఎట్ట‌కేల‌కు పూరీ టైమ్ రీస్టార్ట‌యింది. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత మ‌రో ప్ర‌య‌త్నం మొద‌లైంది.

త‌ను ప్ర‌స్తుతం రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం గోవాలో స్క్రిప్ట్ రాస్తున్నాడని వార్త‌లొచ్చాయి. బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న పూరీ విజ‌య్ సినిమాతో పాటు.. వరుస‌గా భారీ చిత్రాల‌పై పూరీ క‌న్నేశాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్ల‌లో మునిగిపోయాడు. ఆ కార‌ణంగానే త‌ను హైద‌రాబాద్ లో లేక‌పోయినా అత‌ని బ‌ర్త్‌ డే వేడుక‌ల్ని అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిపించారు ఛార్మీ. ఇదే వేదిక‌పై ద‌ర్శ‌క‌త్వ శాఖ‌కు సంబంధించిన 30 మంది సీనియ‌ర్ కో డైరెక్ట‌ర్ ల‌కు.. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ల‌కు చెక్కుల‌ని అంద‌జేసింది ఛార్మి. మొత్తానికి ఛార్మీతో స్నేహం వ‌ల్ల పూరికి కాలం క‌లిసొస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక నుంచి పూరీ దండ‌యాత్ర అసాధార‌ణంగా కొన‌సాగే ల‌క్ష‌ణాలే అత్య‌ధికంగా క‌నిపిస్తున్నాయి. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయ‌బోతున్న సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిస్తే పూరీని ప‌ట్టుకోవ‌డం ఇక ఎవ‌రి వ‌ల్లా కాదు. ప్ర‌స్తుతం పూరి గోవాలో స్క్రిప్టును చెక్కుతున్నాడు .. అట్నుంచి రావాల్సి ఉందింకా.