Begin typing your search above and press return to search.

బన్నీతో ఆ డైలాగ్ చెప్పడానికి చెమటలు పట్టాయట!

By:  Tupaki Desk   |   2 Jan 2022 5:00 AM IST
బన్నీతో ఆ డైలాగ్ చెప్పడానికి చెమటలు పట్టాయట!
X
సాధారణంగా సినిమాలలో కొత్తదనం కోసం ఏదైనా ఒక పాత్రకి ఏదో ఒక ప్రాంతానికి చెందిన యాస పెడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో తెరపై తెలంగాణ యాస మాట్లాడే పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప' సినిమాలో ప్రధానమైన పాత్రలన్నీ కూడా చిత్తూరు యాస మాట్లాడతాయి. కథ మొత్తం కూడా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుండటం వలన, ఎక్కువ పాత్రలు ఆ యాసలోనే మాట్లాడతాయి. అదే ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్రలకు ఆ యాసను అంతగా నేర్పించిన యువకుడి పేరే చరణ్.

నాయుడు పేట మండలం 'పూడేరు' ప్రాంతానికి చెందిన చరణ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. 'అల వైకుంఠపురములో' సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ సార్ ను చూడటానికి ప్రయత్నించి, అందుకు అవకాశం లేకపోవడంతో వెనక్కి వచ్చేశాము. అలాంటిది ఆయన తరువాత సినిమాలో నటించే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నా కళ్లను నేను నమ్మలేకపోతున్నట్టుగా అనిపించింది. సునీల్ గారికి .. అనసూయగారికి చిత్తూరు యాసను నేర్పించే పనిని కూడా సుకుమార్ సార్ నాకు అప్పగించారు.

నాకు సునీల్ గారు అంటే చాలా ఇష్టం .. ఆయనను చూసే నేను సినిమాల్లోకి వచ్చాను. ఆయన సినిమాలో నేను చేస్తానని గానీ .. చిత్తూరు యాస నేర్పించడం కోసం ఆయన పక్కనే కొన్ని రోజుల పాటు ఉంటాననిగాని నేను అసలు అనుకోలేదు. ఇదే మాటను నేను సునీల్ గారితో చెబితే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అప్పటి నుంచి ఆయన నాతో చాలా క్లోజ్ గా ఉండేవారు. ఇక నా ఫస్టు షూటింగు .. ఫస్టు డైలాగ్ బన్నీ సార్ తో పెట్టారు. "ఆడే కూలోడు .. ఆడికి మనం కూలోళ్లవేంట్రా" అనే డైలాగ్ చెప్పడానికి నేను చాలా టెన్షన్ పడిపోయాను. కానీ డైలాగ్ చెప్పిన తరువాత బన్నీ సార్ నన్ను బాగా మెచ్చుకున్నారు.

ఈ సినిమాను మా ఇంట్లో వాళ్లు చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఎందుకంటే నేను సినిమాల పట్ల గల ఇంట్రెస్ట్ తో కృష్ణానగర్ కి వచ్చాను. ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటూ సినిమాల్లో ప్రయత్నాలు చేశాను. రూమ్ రెంట్ కూడా కట్టకుండా ఎక్కువ రోజులు అక్కడ అలా ఉండటం కరెక్ట్ కాదని అనిపించి వెనక్కి వచ్చేశాను. రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు .. నువ్వు రా అని చెప్పేసి మళ్లీ వాళ్లు నన్ను పిలిపించారు. అప్పటి నుంచి ఎక్కడ ఏ పని ఉందని చెప్పినా వెంటనే వెళ్లిపోయేవాడిని. అలాంటి నాకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినందుకు నా కంటే నా ఫ్రెండ్స్ ఎక్కువ సంతోషపడ్డారు" అని చెప్పుకొచ్చాడు.