Begin typing your search above and press return to search.

#RC15 విషయమై చెన్నైలో శంకర్ ను కలిసిన చరణ్ - దిల్ రాజు..!

By:  Tupaki Desk   |   5 July 2021 7:37 AM GMT
#RC15 విషయమై చెన్నైలో శంకర్ ను కలిసిన చరణ్ - దిల్ రాజు..!
X
దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ - మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది చరణ్ కెరీర్ లో 15వ సినిమా.. దిల్ రాజు బ్యానర్ కు 50వ చిత్రం. అయితే 'ఇండియన్ 2' సినిమా వివాదం కోర్టు దాకా వెళ్లడం.. ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు శంకర్ మరో సినిమాను డైరెక్ట్ చేయకూడని కేసు వేయడంతో '#RC15' ప్రాజెక్ట్ ఇప్పట్లో ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.

అయితే 'ఇండియన్‌ 2' వివాదంలో శంకర్‌ కు ఊరట లభించింది. లైకా ప్రొడక్షన్స్‌ వేసిన పిటిషన్‌ ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింసింది. దీంతో శంకర్‌ తదుపరి ప్రకటించిన సినిమాలను డైరెక్ట్ చేసుకునే అవకాశం కలిగింది. 'చరణ్‌ - శంకర్‌' పాన్‌ ఇండియా చిత్రాన్ని పట్టాలెక్కేందుకు మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో నిన్న ఆదివారం హీరో రామ్ చరణ్ - ప్రొడ్యూసర్ దిల్ రాజు చెన్నై వెళ్లి డైరెక్టర్ శంకర్ ను మీట్ అయ్యారు. RC15 ప్రాజెక్ట్ గురించి చర్చించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. చెన్నైలో శంకర్ - చరణ్ - దిల్ రాజు మీటింగ్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తవ్వగా.. రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఆగస్ట్ నెలాఖరుకు చరణ్ - ఎన్టీఆర్.. చెర్రీ - అలియా భట్ కాంబోలో సాంగ్స్ చిత్రీకరణ ముగిస్తారని తెలుస్తోంది. అలానే రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ మరో పది రోజుల్లో పూర్తవుతుంది. ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసి శంకర్ ప్రాజెక్ట్ లో చరణ్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

కాగా, '#RC15' ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కియరా అద్వానీ ని ఫైనలైజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో 'వినయ విధేయ రామ' చిత్రంలో ఆడిపాడిన అమ్మడికే చెర్రీ మొగ్గుచూపినట్లు టాక్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ ని ఖరారు చేసినట్టు సమాచారం. వీటిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా వెల్లడించే వరకు ఆగాల్సిందే.