Begin typing your search above and press return to search.

యూత్ 'ఉప్పెన'వంటి ఉత్సాహమే హిట్ తెచ్చింది: చరణ్

By:  Tupaki Desk   |   17 Feb 2021 11:00 PM IST
యూత్ ఉప్పెనవంటి ఉత్సాహమే హిట్ తెచ్చింది: చరణ్
X
ప్రేమకథలను ఆదరించడానికీ .. అభిషేకించడానికి యూత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అందమైన ప్రేమకథలకు వాళ్లు ఎప్పుడూ వెల్ కమ్ చెబుతూనే ఉంటారు .. వెంటపడి మరీ విజయాలను ముట్టజెబుతుంటారు. అదే పని ఇప్పుడు 'ఉప్పెన' సినిమా విషయంలోనూ చేశారు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా, అనూహ్యమైన విజయాన్ని సాధించింది. అన్ని థియేటర్లను ఈ 'ఉప్పెన' ముంచెత్తుతోంది. బాక్సాఫీస్ కి భారీ వసూళ్లను వడ్డిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజున రాజమండ్రిలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రషన్స్ ను నిర్వహించారు.

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చరణ్ మాట్లాడుతూ .. ముందుగా మైత్రీ మూవీ మేకర్స్ వారిని అభినందించాడు. కొత్తవాళ్లయిన హీరో హీరోయిన్లతో పాటు కొత్త దర్శకుడిని కూడా పరిచయం చేయడంపట్ల హర్షాన్ని వ్యక్తం చేశాడు. ముగ్గురు కొత్తవాళ్లను నమ్మేసి 30- 40 కోట్లు ఖర్చుచేయడమనేది సాధారణమైన సాహసం కాదని అన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ప్రతిపాటను ఒక ఆణిముత్యంలా అందించాడని చెప్పాడు. అలా ఆయన ఈ సినిమా విజయం విషయంలో కీలకమైన పాత్రను పోషించాడని చెప్పాడు.

వైష్ణవ్ తేజ్ చాలా బాగా చేశాడనీ .. చిరంజీవి - పవన్ కల్యాణ్ ప్రోత్సాహం అందుకు బలమైన కారణమని అన్నాడు. అలాంటి పెద్దల సహాయ సహకారాలు లభించడం వైష్ణవ్ తేజ్ అదృష్టమని చెప్పాడు. ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కి దక్కని గ్రాండ్ వెల్కమ్ కృతిశెట్టికి లభించిందనీ, ఆమె మరో స్థాయికి వెళ్లడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. విజయ్ సేతుపతి నటన ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచిందని చెప్పాడు. బుచ్చిబాబు .. తన గురువైన సుకుమార్ పేరు నిలబెట్టాడని అభినందించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్లకు వచ్చి ఈ సినిమాను విజయవంతం చేయడం విశేషమని చెప్పాడు. వాళ్ల 'ఉప్పెన'వంటి ఉత్సాహమే ఈ సినిమా ఈ స్థాయిలో దూసుకెళ్లడానికి కారణమంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు.