Begin typing your search above and press return to search.

షాకింగ్ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది

By:  Tupaki Desk   |   12 July 2015 5:32 AM GMT
షాకింగ్ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది
X
చంద్రశేఖర్ ఏలేటి లాంటి దర్శకుడుండటం టాలీవుడ్ చేసుకున్న అదృష్టమని చెప్పాలి. కమర్షియల్ సినిమాల మోజులో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు కొత్త నడకలు నేర్పిన దర్శకుడతను. ఐతే దగ్గర్నుంచి సాహసం వరకు అతడు తీసిన ప్రతి సినిమా చాలా భిన్నంగానే ఉంటుంది. అనుకోకుండా ఒక రోజు లాంటి సినిమా చూసిన బాలీవుడ్ వాళ్లు కూడా తెలుగులో ఇలాంటి సినిమా వచ్చిందా అని ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఐతే తెలుగులో కమర్షియల్ డైరెక్టర్లకే వీరతాళ్లు వేస్తారు. ఏలేటి లాంటి ప్రతిభావంతులకు రావాల్సినంత గుర్తింపు రాదు. అందుకే సాహసం విడుదలైన రెండేళ్లకు కూడా ఇంకో సినిమా మొదలుపెట్టలేకపోయాడు ఏలేటి.

ఐతే బాగా గ్యాప్ వచ్చినప్పటికీ.. అతడీసారి ఓ పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈగ, అందాల రాక్షసి, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా లాంటి సినిమాలతో అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి ఏలేటితో ఓ సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ పెద్ద హీరోనే లైన్లో పెట్టినట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్. ఇదే నిజమైతే ఇది షాకింగ్ కాంబినేషన్ అనే చెప్పాలి. చంద్రశేఖర్ ఇంతకుముందు గోపీచంద్ లాంటి మీడియం రేంజి హీరోతో చేశాడు కానీ.. స్టార్ హీరోతో పని చేయబోతుండటం ఇదే తొలిసారి అవుతుంది. స్టార్ వాల్యూ లేకపోవడం వల్ల అతడి సినిమాలు కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాలేదు కానీ.. వెంకీ లాంటి హీరోతో సినిమా అంటే కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది. దృశ్యం సినిమా ఫలితం చూశాక వెంకీకి ఎలాంటి ప్రయోగాత్మక సినిమాకైనా రెడీ అన్న ధీమా వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఏలేటితో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇది ఓ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కే లవ్ స్టోరీ అని చెబుతున్నారు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమా టాలీవుడ్‌లో కొత్త ట్రెండుకు దారితీయాలని ఆశిద్దాం.