Begin typing your search above and press return to search.

పాటే టైటిల్‌ గా చంద్రసిద్ధార్థ్ మూవీ!

By:  Tupaki Desk   |   3 Oct 2017 12:45 PM GMT
పాటే టైటిల్‌ గా చంద్రసిద్ధార్థ్ మూవీ!
X
ప్రజాదరణ పొందిన సినిమా పాటల్లోని పదాలు, పల్లవిలోని పదాలు... టైటిల్ గా వాడుకుంటూ... సినిమాలను రూపొందించడం కొత్త విషయం ఏమీ కాదు. కాకపోతే... కేవలం తనలోని ఆధ్యాత్మిక చింతనను చెప్పుకోవడానికి పాటలాగా రాసిన ఒక సుదీర్ఘ కవిత... ఆ తర్వాతి కాలంలో... సంక్షిప్త రూపంలో సినిమా పాటగా మారడం ఒక తమాషా అయితే... అదే పాటను కొంత భాగం మళ్లీ వాడుకుంటూనే... అందులోని పదాలనే టైటిల్ గా ఎంచుకోవడం తాజా విశేషం. అలాంటి విభిన్న అంశాలను కలిగి ఉన్న చిత్రమే.. చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ‘ఆట గదరా శివా’ చిత్రం.

తనికెళ్ల భరణి చాలా ఏళ్ల కిందట ‘ఆటగదరా శివా’ అంటూ ఒక కవిత రాశారు. సహజంగా శివభక్తుడు అయిన ఆయన శివతత్వంలోని వైరుధ్యాలను చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తూ కవితాను పాట రూపంలో రాశారు. తెలుగురాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఆయన స్వయంగా సభల్లో పాల్గొని ఆ పాటను ఆలపించి.. దానికి బహుళ ప్రాచుర్యం కల్పించారు కూడా! తర్వాతి కాలంలో ఆయన మిధునం సినిమాకు దర్శకత్వం వహించినప్పుడు ఆ చిత్రంలో ఈ పాటను వాడారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నప్పటికీ.. ఈ పాటను ఆయనతో పాడించకుండా... జేసుదాస్ తో పాడించి.. ఆ పాటకు ఒక విలక్షణతను తీసుకువచ్చారు. పాట కూడా బాగా పాపులర్ అయింది.

ఆ పాటలోని పదాలే టైటిల్ గా ఇప్పుడు ‘ఆటగదరా శివా’ చిత్రం రూపొందుతోంది. చంద్రసిద్ధార్థ్ ఈ సినిమాకు దర్శకుడు. మిధునంలో వాడిన పాటనే.. కొంతభాగం యథాతథంగా ఈ చిత్రంలో కూడా వాడినట్లు దర్శకుడు చెబుతున్నారు. ఈ పాటను వాడుకోవడానికి, అదే పదాలను టైటిల్ గా వాడుకోవడానికి తనికెళ్ల భరణి అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పారు. మొత్తానికి ఈ భావుకత గల చిత్రాల దర్శకుడినుంచి మరో ఆణిముత్యం వంటి సినిమా వస్తుందని ఆశించవచ్చు.