Begin typing your search above and press return to search.

నదిలోకి నాణాలు విసరడం వెనుక రీజన్ అదే: చందూ మొండేటి

By:  Tupaki Desk   |   12 Aug 2022 4:05 AM GMT
నదిలోకి నాణాలు విసరడం వెనుక రీజన్ అదే: చందూ మొండేటి
X
చందూ మొండేటి దర్శకుడిగా కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. వాటిలో 'కార్తికేయ' ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది. ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో, ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశారు. అనేక అవాంతరాలను దాటుకుని ఆ సీక్వెల్ గా 'కార్తికేయ 2' ను పూర్తి చేశారు. నిఖిల్ హీరోగా చేసిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీన థియేటర్లకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో చందూ మొండేటి మాట్లాడుతూ .. " దేవుడికి .. మనిషికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. కొన్ని కార్యాలు మనుషుల ద్వారానే భగవంతుడు పూర్తి చేయిస్తూ ఉంటాడు.

అందుకోసం ఆయన మనలను ఎంచుకున్న విషయం కూడా మనకు తెలియదు. దేవుడి విషయంలో మనం పాటిస్తున్న ఆచారాలను కొంతమంది చాలా తేలికగా కొట్టిపారేస్తుంటారు. అభిషేకం పేరుతో లీటర్ల కొద్దీ పాలను వృథా చేయడం ఎందుకూ? అని కొంతమంది విమర్శిస్తుంటారు. నదిలో డబ్బులు విసరసడమేంటి .. ఎవరికైనా దానం చేయవచ్చును గదా అంటారు.

కానీ ఒకసారి మనం ఆలోచన చేస్తే మన పూర్వీకులు పెట్టిన ప్రతి ఆచారంలోను ఒక బలమైన కారణం కనిపిస్తుంది. పూర్వం మనం వాడే నాణాలు రాగితో చేసేవారు. రాగి .. నీటిలోని మాలిన్యాలను తొలగిస్తుంది.

ఎక్కడెక్కడి నుంచో ప్రవహిస్తూ వస్తున్న నీరు అనేక మలినాలను కలుపుకుంటూ వెళుతుంటుంది. అలాంటి మాలిన్యాన్ని తొలగించడానికి ఆ నీటిలో రాగి నాణాలు వేసేవారు. కాలక్రమంలో రాగి నాణాలు లేపోయినా ఆ ఆచారం మాత్రం కొనసాగుతూ వస్తోంది. ఇలా మనం పాటించే ప్రతి అంశం వెనుక అర్థవంతమైన కారణం కనిపిస్తుంది" అని చెప్పుకొచ్చాడు.

'కార్తికేయ' సినిమా లోకల్ కంటెంట్ తో విజయాన్ని సాధించింది. సెకండ్ పార్టు విషయానికి వస్తే ద్వాపర యుగానికీ .. ద్వారకా నగరానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా హిట్ అయితే అంతర్జాతీయ స్థాయిలో 3వ భాగం ఉండేలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాము. నా నెక్స్ట్ మూవీస్ విషయానికి వస్తే గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా .. నాగార్జున గారితో ఒక సినిమా చేయబోతున్నాను' అని చెప్పుకొచ్చాడు.