Begin typing your search above and press return to search.

తెలుగు హీరోయిన్లతో ఇబ్బందేంటని నిలదీస్తోంది

By:  Tupaki Desk   |   23 Jun 2016 1:30 PM GMT
తెలుగు హీరోయిన్లతో ఇబ్బందేంటని నిలదీస్తోంది
X
పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెత మన టాలీవుడ్లో హీరోయిన్ల సంగతి చూస్తే అర్థమైపోతుంది. తెలుగు హీరోయిన్లంటే మన దర్శక నిర్మాతలకు చిన్న చూపు. ఎప్పుడూ పరభాషా హీరోయిన్ల వైపే చూస్తుంటారు. అందుకే స్వాతి.. శ్రీదివ్య.. ఆనంది.. లాంటి టాలెంటెడ్ హీరోయిన్లకు తమిళంలో వచ్చినంత పేరు.. అవకాశాలు తెలుగులో రాలేదు. ఐతే తెలుగు హీరోయిన్ల విషయంలో ఈ ధోరణి మారాలంటోంది ‘కుందనపు బొమ్మ’లో టైటిల్ రోల్ పోషించిన తెలుగమ్మాయి చాందిని చౌదరి.

‘‘తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలకు ఎందుకు తక్కువ అవకాశాలొస్తాయో నాకర్థం కాదు. చక్కగా తెలుగు మాట్లాడే.. బాగా నటించగలిగే అమ్మాయిలు ఉన్నా కూడా ఎక్కువగా బయటివారికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారో తెలియదు. ఈ మధ్య కాస్త పరిస్థితులు మారుతున్నాయనే అనుకుంటున్నా’’ అని చాందిని చెప్పింది.
తన తొలి సినిమాగా ‘కుందనపు బొమ్మ’నే రిలీజ్ కావాల్సిందని.. కానీ అనివార్య కారణాలతో అది వాయిదా పడిందని.. కెరీర్ ఆరంభంలో తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలు దెబ్బ తీశాయని చాందిని చెప్పింది. ‘కుందనపు బొమ్మ’తోనే నేను తెలుగు సినిమాకు పరిచయం కావాల్సింది. ఆ సినిమా వాయిదా పడుతూ రావడంతో ‘కేటుగాడు’ మొదట విడుదలైంది. మొదట్లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు నా రెండేళ్ల కెరీర్‌ ను వృథా చేశాయి. అప్పుడే అందరి మాటలూ నమ్మడానికి లేదని ఫిక్స్ అయిపోయా’’ అని ఆమె అంది.

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లోకి రావడం గురించి చెబుతూ.. ‘‘నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నీ సరదాగా చేసినవే. ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర చేరడం.. ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం చూసి అందులో నేను కేవలం సరదాకే నటిస్తుండేదాన్ని. ఫీచర్ సినిమా అందుకు పూర్తి విరుద్ధం. ఇక్కడ ప్రొఫెషనలిజం ఉంటుంది. ఇదే నా ప్రొఫెషన్ అనుకున్నాకే ఇక్కడికి వచ్చా. ఐతే ఇక్కడ నాకు భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. అప్పట్నుంచి జాగ్రత్తగా ఉంటున్నా’’ అని చాందిని చెప్పింది.