Begin typing your search above and press return to search.

అందరి కళ్లూ ‘చల్’ వేడుక మీదే

By:  Tupaki Desk   |   25 March 2018 6:25 AM GMT
అందరి కళ్లూ ‘చల్’ వేడుక మీదే
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల వేడుకల్లో పాల్గొనడమే గగనం. ఇక వేరే వాళ్ల సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లు రావడం అంటే మరీ అరుదు. పైగా తన ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఒక వేడుకకు వస్తున్నాడంటే ఆసక్తి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? అందుకే ఈ రోజు సాయంత్రం జరగబోయే ‘చల్ మోహన రంగ’ ప్రి రిలీజ్ వేడుక కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చివరగా పవన్-త్రివిక్రమ్ పాల్గొన్న వేడుక ‘అజ్ఞాతవాసి’దే. ఆ తర్వాత ఇద్దరూ అడ్రస్ లేరు. పవన్ రాజకీయ కార్యకలాపాల్లో మునిగిపోగా.. త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్టు పనిలో పడిపోయాడు. ఇన్నాళ్లకు మళ్లీ ఇద్దరూ కలిసి ఒక సినిమా వేడుకలో పాల్గొంటుండటం విశేషమే.

‘చల్ మోహన రంగ’కు పవన్-త్రివిక్రమ్ నిర్మాతలు కూడా అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ఉమ్మడి ప్రొడక్షన్లో వస్తున్న తొలి సినిమా గురించి ఇద్దరూ ఏం మాట్లాడతారు.. నితిన్ గురించి ఎలా స్పందిస్తారు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంకా నితిన్ తన ఆరాధ్య కథానాయకుడిపై ఎలా అభిమానాన్ని చాటుకుంటాడన్నది కూడా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించే విషయమే. ‘రౌడీఫెలో’ లాంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కృష్ణ చైతన్య రూపొందించిన ‘చల్ మోహన రంగ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఐతే ఈ చిత్ర ప్రమోషన్ జోరు పెంచి మరింత హైప్ తీసుకురావాలనుకుంటోంది చిత్ర బృందం. అందుకే ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ తోడ్పడుతుందని భావిస్తున్నారు.