Begin typing your search above and press return to search.

చక్రి కుటుంబం తిండికి ఇబ్బందిపడే స్థితిలో లేదు : మహిత్ నారాయణ్

By:  Tupaki Desk   |   7 May 2020 10:00 PM IST
చక్రి కుటుంబం తిండికి ఇబ్బందిపడే స్థితిలో లేదు : మహిత్ నారాయణ్
X
మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మ్యూజికల్ ఆల్బమ్స్ అందించాడు చక్రి. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందిన చక్రి కేవలం 40 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకానికి వెక్కిపోయాడు. చక్రి మరణం అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ గా ఎదిగిన చక్రి ఆర్థికంగా బాగా స్థిరపడలేకపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన మరణం తర్వాత తమ్ముడు మోహిత్ ప్రస్తుతం తన తల్లితో కలిసి మణికొండలో నివాసం ఉంటున్నాడు. మహిత్ నారాయణ్ కూడా అన్న బాటలోనే వెళ్తూ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. మహిత్ దివ్యాంగుడనే విషయం తెలిసిందే. ఈయన కొన్ని చిన్న సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. కానీ తన అన్న మాదిరిగా సక్సెస్ కాలేకపోయారు. అయితే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ ఈ లాక్‌ డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్నారని.. ఆయన కుటుంబానికి కోవిద సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, సినీ నిర్మాత డాక్టర్ అనూహ్య రెడ్డి సాయం అందించారని మీడియాలో వార్తలు వచ్చాయి. అనూహ్య రెడ్డి ఫేస్‌ బుక్‌ లో పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా మీడియాలో వార్తలను ప్రచురించారు. అయితే కొన్ని మీడియాలలో చక్రి కుటుంబం తిండికి ఇబ్బందిపడుతోందని న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ తెలుసుకున్న మహిత్ నారాయణ్ మనస్తాపానికి గురయ్యాడు.

ఈ కథనాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. చక్రి కుటుంబం తిండికి ఇబ్బందిపడుతోన్న పరిస్థితి అంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు మహిత్. 'నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్లలేనని తెలిసి.. ఇంట్లో కొన్ని మెడిసిన్స్ అవసరమని వాటిని ఒక నిర్మాత తీసుకొచ్చి ఇచ్చారు. నాతో కరోనా వైరస్‌ పై ఒక పాట కూడా చేయించుకుంటున్నారు. దానిలో భాగంగానే ఆమె మెడిసిన్స్ తదితరాలు నాకు అందించారు. దీన్ని మీడియా వక్రీకరించింది' అని మహిత్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసారు. తన ఫ్యామిలీతో కలిసి ఆనందంగా జీవిస్తున్నామని.. తిండికి లేని పరిస్థితి అయితే లేదన్నారు మహిత్. లగ్జరీ లైఫ్ అనుభవించకపోయినా మంచి జీవితాన్నే గడుపుతున్నామని స్పష్టం చేశారు. తన తండ్రి పింఛను వస్తోందని.. అది కుటుంబ పోషణకు సరిపోతుందని చెప్పారు. అంతేకాకుండా తాను కొన్ని సినిమాలు చేస్తున్నానని.. తాను మ్యూజిక్ అందించిన ‘పరారీ’ అనే సినిమా ఆడియో ఇటీవల విడుదలైందని మహిత్ చెప్పుకొచ్చారు. తాను కూడా సంపాదిస్తున్నాని.. తాము ఎవ్వరినీ యాచించడం లేదని మహిత్ చెప్పుకొచ్చారు. ఇంకోసారి మీడియాలో తన కుటుంబం పట్ల తప్పుడు వార్తలు రాస్తే ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమని మహిత్ హెచ్చరించారు.