Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'చక్ర'

By:  Tupaki Desk   |   19 Feb 2021 5:11 PM GMT
మూవీ రివ్యూ: చక్ర
X
చిత్రం: 'చక్ర'

నటీనటులు: విశాల్-రెజీనా కసాండ్రా-శ్రద్ధ శ్రీనాథ్-కేఆర్ విజయ-రోబో శంకర్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: బాలసుబ్రహ్మణియన్
నిర్మాత: విశాల్
రచన-దర్శకత్వం: ఎం.ఎస్.ఆనందన్

తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోల్లో విశాల్ ఒకడు. తెలుగువాడే అయిన విశాల్.. తమిళంలో యాక్షన్ థ్రిల్లర్లకు పెట్టింది పేరు. అతడి నుంచి కొత్తగా వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘చక్ర’. ఎం.ఎస్.ఆనందన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం అనేక అవాంతరాలను దాటుకుని ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

చంద్రు (విశాల్) తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సైనికుడిగా దేశానికి సేవలందిస్తుంటాడు. విపరీతమైన దేశభక్తి ఉన్న అతను తన తండ్రికి దక్కిన అశోక చక్ర అవార్డును గొప్ప గౌరవంగా భావిస్తుంటాడు. అలాంటి వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగి ఆ పతకం పోతుంది. చంద్రు ఇంటితో పాటు సిటీలో ఒకే రోజు దాదాపు 50 ఇళ్లలో దొంగతనాలు జరుగుతాయి. డబ్బు, బంగారం కలిపి రూ.7 కోట్ల దాకా దోచుకుంటారు దొంగలు. ఈ దొంగతనం సమయంలో తన బామ్మ కూడా గాయపడి కోమాలోకి వెళ్లడంతో చంద్రు అత్యవసరంగా ఇంటికి వస్తాడు. పోలీసాఫీసర్ అయిన తన ప్రేయసి గాయత్రి (శ్రద్ధ శ్రీనాథ్)తో కలిసి ఈ దొంగతనం వెనుక ఎవరున్నారో కనిపెట్టాలని రంగంలోకి దిగుతాడు. ఐతే ఇది చిల్లర దొంగలు చేసిన పని కాదని, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని అతడికి అర్థమవుతుంది. మరి ఆ నెట్వర్క్ ఏంటి.. దాన్ని చంద్రు ఎలా ఛేదించాడు.. తనకెంతో ప్రతిష్టాత్మకమైన తండ్రి అశోక చక్ర పతకాన్ని తిరిగి ఎలా పొందాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘చక్ర’ ట్రైలర్ చూడగానే.. విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘అభిమన్యుడు’ గుర్తుకు రాకమానదు. అందులో డిజిటల్ విప్లవం తాలూకు చెడు ప్రభావాన్ని అద్భుతంగా చూపించాడు దర్శకుడు మిత్రన్. ఈ ఇంటర్నెట్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత దెబ్బ తిని జనాలు మోసగాళ్లకు ఎలా టార్గెట్ అవుతున్నారో.. ఆలోచింపజేసే, ఇంకా చెప్పాలంటే భయపెట్టే రీతిలో చూపించారు. అదే సమయంలో ఒక ఆసక్తికరమైన కథనూ చెప్పారు. కావాల్సినంత థ్రిల్ కూడా ఇచ్చారు. ‘చక్ర’ కథాంశం కూడా అలాంటిదే. కానీ దానంత పకడ్బందీగా ఇది లేకపోవడం, దాని ముందు ఇది చాలా చిన్నది అనిపించడం దీనికున్న అతి పెద్ద ప్రతికూలత. ముందుగా పసందైన భోజనం వడ్డించేసి.. అది తిన్నాక సూప్ తాగమన్నట్లుగా ఉంటుంది ‘అభిమన్యుడు’ తర్వాత ‘చక్ర’ సినిమా చూస్తే. చిన్న పరిధిలో తెరకెక్కిన ఒక మామూలు సినిమాకు అవసరానికి మించిన బిల్డప్ ఇచ్చి విశాల్ అండ్ కో నిరాశ పరిచింది.

‘చక్ర’ సినిమాలో ఒక ట్విస్టు లాగా దాచిపెట్టిన పెద్ద విషయం.. ఇందులో విలన్ గా రెజీనా నటించడం. నిజానికి ఈ విషయం ఎప్పుడో మీడియా రివీల్ చేసేసింది. కాబట్టి దీన్ని స్పాయిలర్ లాగా చూడాల్సిన అవసరమేమీ లేదు. ‘అభిమన్యుడు’లో అర్జున్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో.. దాన్ని తనదైన పెర్ఫామెన్స్ తో అర్జున్ ఎంత పకడ్బందీగా పోషించాడో తెలిసిందే. ‘చక్ర’ సినిమాలో విలన్ ఓ అమ్మాయి అని తెలిశాక కమిషనర్ పాత్రధారి ‘‘ఇదంతా చేసింది ఆఫ్ట్రాల్ ఓ అమ్మాయా’’ అంటాడు. దానికి హీరో బదులిస్తూ.. అమ్మాయి కానీ, ఆఫ్ట్రాల్ కాదు సార్ అంటాడు. ఈ డైలాగ్ చూసి ఈ పాత్రను ఓ రేంజిలో తీర్చిదిద్ది ఉంటారేమో.. ‘అభిమన్యుడు’లో అర్జున్ ను మించి పవర్ ఫుల్ గా ఉంటుందేమో అనుకుంటాం. కానీ చిన్నతనంలోనే తన తల్లిని చంపిన తండ్రి సవతి తల్లిలను చంపేసి పెద్ద క్రిమినల్ అయిపోయినట్లుగా ఒక బ్యాక్ స్టోరీ ద్వారా పెద్ద బిల్డప్ తో ఈ పాత్రను పరిచయం చేసి.. ఆ తర్వాత తేల్చి పడేశారు. విలన్ ఓ అమ్మాయి అనేదగ్గర కొంచెం సర్ప్రైజ్ అవుతారు తప్పితే.. తర్వాతి సన్నివేశం నుంచే ఆ పాత్రను లైట్ తీసుకునేలాగా పేలవమైన సన్నివేశాలు వచ్చి పోతుంటాయి.

సిటీలో ఒకేసారి 50 ఇళ్లలో దొంగతనం చేయడం అనే పాయింట్ తో మొదలైన కథ.. దాని మీద జరిగే పరిశోధనతో ముందుకు సాగుతుంది. అంతకుమించి పెద్దగా ముందుకు కదలదు. మాస్ రాబరీ వెనుక ఎవరున్నది హీరో ఛేదించే క్రమాన్ని ఒక దశ వరకు ఆసక్తికరంగానే నడిపించారు. ఈ కోణంలో సాగే పరిశోధన ఆసక్తి రేకెత్తిస్తుంది. కొన్ని సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి కూడా. విలన్ రంగంలోకి దిగి పోలీసులకు సవాలు చేసే సన్నివేశాలు కూడా బాగుంటాయి. ఐతే ‘జులాయి’లో హీరో మాదిరే.. ఇక్కడ కూడా సూపర్ ఇంటిలిజెంట్ అయిన హీరో అన్ని విషయాలనూ చిటికెలో ఛేదించేస్తూ ముందుకెళ్లిపోవడమే అంతగా రుచించదు. ఎక్కడా అతడికి ఎదురు దెబ్బే తగలదు. విలన్ ఎత్తుగడల్ని ముందే ఊహించేసి చకచకా అన్నీ చేసేస్తుంటే.. ఇక ఆసక్తి ఏముంటుంది? ఎక్కడా కూడా హీరోకు బ్రేక్ పడేలా లాక్ వేసుకోలేదు. ఇక హీరో-విలన్ మధ్య ఫేస్ ఆఫ్ గురించి ఏదో ఊహించుకుంటే.. వాళ్లిద్దరూ ఎదురు పడి తాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంటర్వెల్ దగ్గరే విలన్ ఎవరో తెలిసిపోగా.. ద్వితీయార్ధంలో కాసేపటికే హీరో-విలన్ ఎదురు పడతారు. ఆ సన్నివేశం తుస్సుమనిపించడంతో ఇక విలన్ ఆటను హీరో ఎలా కట్టిస్తాడని చూడటమే మిగిలుంటుంది. పతాక సన్నివేశాలను పూర్తిగా తేల్చేశారు. ప్రథమార్ధం వరకు ‘చక్ర’ ఓకే అనిపించినా.. ద్వితీయార్ధానికి వచ్చేసరికి చప్పగా సాగుతుంది. చెప్పుకోదగ్గ మలుపులూ లేక.. ముగింపు కూడా సాధారణంగా అనిపించడంతో ‘చక్ర’ మీద చివరికొచ్చేసరికి ఇంప్రెషన్ తగ్గిపోతుంది. ‘అభిమన్యుడు’ చూడని వాళ్లకు ‘చక్ర’ ఓకే అనిపించొచ్చు కానీ.. అది చూసిన వాళ్లకు మాత్రం ఇది నిరాశను మిగులుస్తుంది.

నటీనటులు:

విశాల్ కు ఇలాంటి పాత్ర కానీ.. సినిమా కానీ ఏమాత్రం కొత్త కాదు. అతను బాగా అలవాటైపోయినట్లు కనిపిస్తాడు ఇలాంటి సినిమాల్లో. విశాల్ బాగా చేయలేదు అనలేం కానీ.. అతి విశ్వాసంతో కూడిన అతడి పాత్ర కొన్ని చోట్ల చికాకు పెడుతుంది. అతడి హావభావాలు కూడా రొటీన్ గా అనిపిస్తాయి. ఐతే మిలిటరీ మ్యాన్ గా విశాల్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం బాగుంది. ఏదో ప్రత్యేకత ఉంటే తప్ప పాత్రలు ఎంచుకోని శ్రద్ధ శ్రీనాథ్.. గాయత్రి క్యారెక్టర్ కు ఎందుకు ఒప్పుకుందో అర్థం కాదు. ఆమె చేయాల్సిన పాత్ర కాదిది. హీరోకు ఎలివేషన్ ఇవ్వడం కోసం ఆమె పాత్రను తేల్చి పడేశారు కూడా. విలన్ గా రెజీనాను చూడటం ముందు ఆశ్చర్యం కలిగించినా ఆమె పాత్ర మీద పెట్టుకున్న అంచనాలు త్వరగానే కూలిపోతాయి. తన పెర్ఫామెన్స్ బాగున్నా ఆ పాత్ర మాత్రం తేలిపోయింది. రోబో శంకర్ కొన్ని చోట్ల పంచులతో నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరో బామ్మ పాత్రలో కేఆర్ విజయ ఓకే.

సాంకేతిక వర్గం:

యువన్ శంకర్ రాజా తన సత్తా చాటుకునే అవకాశం ‘చక్ర’ పెద్దగా ఇవ్వలేదు. సినిమాలో పాటలే లేవు. ఇలాంటి థ్రిల్లర్ సినిమాల్లో అది ఒక రకంగా మంచి విషయమే. నేపథ్య సంగీతం రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో మాదిరే ఉంది తప్ప.. అంత ప్రత్యేకంగా ఏమీ లేదు. బాలసుబ్రహ్మణ్యన్ విజువల్స్ రిచ్ గానే అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో వచ్చే యాక్షన్ సన్నివేశంలో కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువల్లో విశాల్ ఏమీ రాజీ పడలేదు. ఇక దర్శకుడు ఎం.ఎస్.ఆనందన్ విషయానికి వస్తే.. అతను ఎంచుకున్న కథ పరిధి చాలా చిన్నది. డిజిటల్ విప్లవం.. దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో ‘అభిమన్యుడు’ లాంటి సినిమా వచ్చాక ప్రేక్షకుల అంచనాలే వేరుగా ఉంటాయి. అలాంటి కథనే ఎంచుకుని ఇంకా తక్కువ పరిధిలో సినిమా తీశాడతను. ఒక దశ వరకు కథనం కొంత పకడ్బందీగా అనిపించినా.. తర్వాత సడలిపోయింది. విలన్ పాత్రను బలహీన పరచడం.. హీరోకు ఎదురే లేదన్నట్లుగా చూపించడం అతడి స్క్రిప్టులో ఉన్న బలహీనతలు.

చివరగా: చక్ర.. మినీ అభిమన్యుడు

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre