Begin typing your search above and press return to search.

తాత కెరియర్ ను మలుపుతిప్పిన 'బాలరాజు' పాత్రలో చైతూ!

By:  Tupaki Desk   |   27 Sept 2021 1:02 PM IST
తాత కెరియర్ ను మలుపుతిప్పిన బాలరాజు పాత్రలో చైతూ!
X
బాలరాజు .. ఈ పేరు వినగానే అందరి మదిలో ఏఎన్నార్ చేసిన జానపద చిత్రం కళ్లముందు కదలాడుతుంది. అప్పటివరకూ తెరపై నడుస్తున్న ట్రెండును ఈ సినిమా మలుపు తిప్పేసింది. ఓ యక్షిణి తనని ప్రేమించమంటూ కథానాయకుడి వెంటపడుతూ ఉంటే, అతను తప్పించుకుంటూ ఉంటాడు. అక్కినేనికి స్టార్ డమ్ ను .. 100 రోజుల పండుగను తెచ్చిన సినిమా ఇది. ఈ సినిమా చూసిన తరువాతనే తాను ఏఎన్నార్ అభిమానిగా మారిపోయానని సావిత్రి చెబుతూ ఉండేవారు. 'మహానటి'లో ఈ సినిమా ప్రస్తావన కూడా వస్తుంది. అంతగా ప్రేక్షకులను ప్రభావితం చేసిన ఈ పాత్రలో చైతూ కనిపించనుండటం విశేషం.

హిందీలో ఆమిర్ ఖాన్ హీరోగా 'లాల్ సింగ్ చద్దా' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతూ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు .. ఆ పాత్ర పేరు 'బాలరాజు' కావడమే విశేషం. తెరపై ఈ పాత్ర కనిపించేది 30 నిమిషాలే అయినా, ఆ పాత్ర ప్రభావం సినిమా అంతటా ఉంటుందని చెబుతున్నారు. బాలరాజు ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు .. ఆ సమయంలోనే ఆయనతో హీరోకి పరిచయం ఏర్పడుతుంది. బాలరాజు ఆత్మీయత .. ఆయన ఆశయం హీరోకి బాగా నచ్చుతాయి. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య విడదీయరాని స్నేహం పెరుగుతుంది. ఆర్మీ నుంచి వెళ్లిన హీరో .. బాలరాజు ఆశయాన్ని నెరవేరుస్తాడు.

ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయట. బాలీవుడ్ లో చైతూ 'బాలరాజు' పాత్రతోనే ఎంటర్ కావడమనేది తన తండ్రి ఆశీర్వాదంగా నాగార్జున భావిస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమా తరువాత హిందీలోను చైతూ ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాతో చైతూ వంటి మంచి స్నేహితుడు తనకి లభించాడని ఆమిర్ ఖాన్ చెబుతూ ఉంటే, నటన పరంగా అనేక విషయాలు ఆయన ద్వారా తెలుసుకునే అవకాశం తనకి కలిగిందని చైతూ చెబుతున్నాడు. తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

ప్రస్తుతం చైతూ తెలుగులో 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. చైతూ సరసన నాయికగా రాశి ఖన్నా అలరించనుంది. ఇటీవలే 'బంగార్రాజు' కూడా పట్టాలెక్కింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన కృతి శెట్టితో కలిసి సందడి చేయనున్నాడు. ఇక ఆ తరువాత సినిమాను శివ నిర్వాణతో చేయనున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. వాటిలో వాస్తవమెంతన్నది చూడాలి.