Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పట్లో మరో కొత్త హీరో తెరంగేట్రం ఉండదు..!

By:  Tupaki Desk   |   28 July 2022 3:54 AM GMT
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పట్లో మరో కొత్త హీరో తెరంగేట్రం ఉండదు..!
X
మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు డజను మంది టాలీవుడ్ లో అడుగుపెట్టారు. స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి వేసిన బాటలో పవన్ కళ్యాణ్ - నాగబాబు - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - అల్లు శిరీష్ - వరుణ్ తేజ్ - సాయిధరమ్ తేజ్ - పంజా వైష్ణవ్ తేజ్ - కళ్యాణ్ దేవ్ - నిహారిక వంటి వారు ఇండస్ట్రీకి వచ్చారు. ఇదే ఫ్యామిలీ పేరు చెప్పుకుని పవన్ తేజ్ కొణిదెల వంటి వారు కూడా హీరోలుగా లాంచ్ అయ్యారు.

'మెగా' బ్రాండ్ తో వచ్చినప్పటికీ వీరిలో చాలా వరకూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి.. పరిశ్రమలో నిలదొక్కుకోడానికి బాగా కష్టపడుతూ వచ్చారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహం చేసుకున్నప్పటి నుంచీ అల్లుడు జేవీ చైతన్య కూడా వెండితెరపై మెగా అరంగేట్రం చేస్తాడేమో అని అందరూ భావించారు.

ఇప్పటికే చిరంజీవి రెండో కూతురు శ్రీజ ను వివాహం చేసుకున్న క‌ళ్యాణ్ దేవ్ ని హీరోగా పరిచయం చేసారు. అదే విధంగా నిహారిక భర్త ని కూడా సినీ రంగ ప్రవేశం చేయిస్తారని అనుకున్నారు. అయితే ఇటీవల చైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎప్పుడైనా తెరంగేట్రం చేయబోనని క్లారిటీ ఇచ్చాడు.

తనకు నటుడిగా మారాలనే ఆసక్తి లేదని.. ప్రస్తుతం తను చేస్తున్న పనితో సౌకర్యవంతంగా ఉన్నానని మెగా అల్లుడు తెలిపాడు. కాకపోతే చైతన్య తెర మీదకు రాకపోయినా.. ఇప్పటికే ప్రొడక్షన్ లోకి దిగాడు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ అనే బ్యానర్ లో నిహారికతో కలిసి వెబ్ సిరీస్‌ లను నిర్మిస్తున్నాడు.

నిహారిక సైతం వివాహం చేసుకున్నప్పటి నుండి నటనకు దూరంగా ఉంటూ.. వెబ్ సిరీసుల నిర్మాణం పైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత మరియు ఆమె భర్త విష్ణు ప్రసాద్ కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా మెగా ఫ్యామిలీలో అందరూ ఏదొక విధంగా ఇండస్ట్రీలో ఉన్నారు. కొందరు తెర మీద క్లిక్ అయితే మరికొందరు తెర వెనుక రాణిస్తున్నారు. కాకపోతే ఇప్పట్లో ఈ కుటుంబం నుంచి మరో కొత్త హీరో వచ్చే అవకాశం లేదు. భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ లేదా అల్లు అర్జున్ కొడుకు అయాన్ హీరోలుగా ఎంట్రీ ఇస్తారేమో. ఇప్పటికే 'అల్లు' నాలుగో తరం నుంచి అర్హ తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. 'శాకుంతలం' సినిమాలో ఆమె లిటిల్ భరతుడి పాత్ర పోషించింది.