Begin typing your search above and press return to search.

ఊపిరి పోసుకుంటున్న ఓటీటీలకు చుక్కెదురు కానుందా..?

By:  Tupaki Desk   |   13 Nov 2020 3:40 PM IST
ఊపిరి పోసుకుంటున్న ఓటీటీలకు చుక్కెదురు కానుందా..?
X
డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కి ప్రత్యామ్నాయ వేదికలుగా మారాయి. ఒకప్పుడు సినిమా చూడటానికి థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ ఇప్పుడు తన మొబైల్ లో హోమ్ స్క్రీన్ పై సినిమా చూస్తున్నాడు. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడడంతో చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలను కూడా ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నారు. ముందు సినిమాల ప్రసారానికే పరిమితమైన ఓటీటీలు.. ఇప్పుడు సొంతంగా సినిమాలు - డాక్యుమెంటరీలు - వెబ్‌ సిరీస్‌ లను నిర్మించి నేరుగా తమ వేదికలపైనే విడుదల చేస్తున్నారు. అయితే తెలుగులో మాత్రం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ డైరెక్ట్ రిలీజుల విషయంలో సక్సెస్ సాధించలేకపోతున్నారనే టాక్ ఉంది. కాకపోతే తెలుగులో డైరెక్ట్ రిలీజులతో ఆరిపోతున్న ఓటీటీలకు మొన్న విడుదలైన 'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమా ఊపిరి పోసినట్లయింది. ఈ సినిమా రిజల్ట్ తో ఇకపై ఇంటర్నేష‌నల్ ఓటీటీలలో కొత్త సినిమాలు తీసుకోవ‌డానికి, త‌మ వీడియో లైబ్ర‌రీ పెంచుకోవ‌డానికి కొత్త బ‌డ్జెట్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఓటీటీ ప్ర‌తినిధులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఓటీటీ కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఓటీటీలకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఓటీటీ(ఓవర్‌ ది టాప్‌) వేదికలతో పాటు ఆన్‌ లైన్‌ న్యూస్‌ - కరెంట్‌ అఫైర్స్‌ పోర్టల్స్ ను సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంటే ఇకపై ఓటీటీలు ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి వస్తాయి. ఓటీటీలు తాము ప్రసారం చేయబోయే కంటెంట్‌ కు ముందుగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఓటీటీలలో రిలీజ్ చేసే సినిమాల్లో ఉన్న స్పెషాలిటీ సెన్సార్ క‌ట్స్ లేక‌పోవ‌డ‌మే అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఓటీటీ కంటెంట్ లో అశ్లీలత, హింస, రొమాన్స్ ఉంటే దానిని అలానే అప్లోడ్ చేసేవారు. కానీ కేంద్రం ఆంక్ష‌లు విధించ‌డంతో ఇప్పుడు ఓటీటీలో అప్లోడ్ చేసే డైరెక్ట్ రిలీజ్ సినిమాల‌కు కూడా సెన్సార్ త‌ప్ప‌నిస‌రి అవుతుంది. దీంతో రాబోయే రోజుల్లో ఓటీటీలకు చుక్కెదురు త‌ప్ప‌దని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.