Begin typing your search above and press return to search.

'వార్తల్ని వేటాడండి.. మహిళల్ని కాదు' అంటూ రియాకు మద్ధతుగా 2500 మంది లేఖ...!

By:  Tupaki Desk   |   15 Sep 2020 5:35 PM GMT
వార్తల్ని వేటాడండి.. మహిళల్ని కాదు అంటూ రియాకు మద్ధతుగా 2500 మంది లేఖ...!
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లే భిన్నాభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఈ కేసు విచారణలో ఉండగా నిజానిజాలు బయటపడకుండానే రియాను మీడియా ఇబ్బందులకు గురి చేయడం బాగాలేదంటూ ఓ వర్గం సెలబ్రిటీలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ కేసును కవర్‌ చేస్తున్న క్రమంలో మీడియా రియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని.. కొన్ని మీడియా సెక్షన్లు రియాను, ఆమె కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్నారని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో రియాపై మీడియా దాడి చేస్తోందని ఆరోపిస్తూ బాలీవుడ్ ప్రముఖులు సోనమ్ కపూర్ - అనురాగ్ కశ్యప్ - గౌరి షిండే - జోయా అక్తర్ సహా 2500 మంది ఇండియన్ న్యూస్ మీడియాకు బహిరంగ లేఖ రాశారు. 'ఫెమినిస్ట్ వాయిస్' బ్లాగ్‌ లో ''వార్తల్ని వేటాడండి.. మహిళల్ని కాదు'' అనే శీర్షికతో ప్రచురితమైన ఈ లేఖపై పలు ఆర్గనైజేషన్ల ప్రతినిధులు కూడా సంతకం చేశారు. ''మేమంతా నీ గురించి బాధపడుతున్నాం.. నువ్వు బాగానే ఉన్నావా?'' అంటూ 'న్యూస్‌ మీడియా ఆఫ్‌ ఇండియా'ను అడుగుతున్నట్లు లేఖలో రాసినట్లు తెలుస్తోంది.

''రియా చక్రవర్తి మీద కొనసాగుతున్న మీ దాడిని చూస్తుంటే.. జర్నలిజం యొక్క నీతిని, మానవ మర్యాద, గౌరవాన్ని సిద్ధాంతాన్ని ఎందుకు విడిచిపెట్టారో అనే అనుమానం కలుగుతోంది. సామాజిక దూరం అనే విషయాన్ని విస్మరించి మీ కెమెరాలతో ఒక యువతిపై శారీరక దాడి చేయాలని ఎందుకు అనుకున్నారో మాకు అర్థం కాలేదు. నిర్విరామంగా ఆమె ప్రైవసీని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తప్పుడు ఆరోపణలపై ఓవర్‌ టైమ్‌ పని చేస్తున్నారు. 'రియాను బంధించండి' అనే డ్రామాలో తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆమె ప్రైవసీని దెబ్బతీస్తున్నారు. సొంత నిర్ణయాలు తీసుకోగలిగే.. పెళ్లి చేసుకోకుండా తన బాయ్ ఫ్రెండ్ తో నివసించే యువతిపై.. దర్యాప్తు సంస్థలు నిందితురాలని నిర్ధారించని యువతిపై.. చట్టం ప్రకారం ఆమెకు కూడా మిగతా వారికి ఉన్న హక్కులు ఉంటాయనే వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ఆమెపై ఊహాజనితమైన కథనాల్ని రూపొందించడంలో మీరు నిమగ్నమయ్యారు'' అని ఈ లేఖలో పేర్కొన్నారు.

''నువ్వు ప్రత్యేకమని మాకు తెలుసు.. ఎందుకంటే సల్మాన్‌ ఖాన్‌ - సంజయ్‌ దత్‌ విషయాల్లో వారి కుటుంబ సభ్యులు, అభిమానుల గురించి ఆలోచించి దయ గౌరవంతో వ్యవహరించావు. కానీ నేరం చేసిందని ఇంకా నిరూపించబడని ఓ మహిళ క్యారెక్టర్‌ ను నాశనం చేశావు. ఆమెను, కుటుంబ సభ్యుల్ని తప్పుపట్టే రీతిలో జనాల్ని ప్రేరేపించావు. తప్పుడు డిమాండ్లకు ఆజ్యం పోశావు. యువతుల్ని చిన్న చిన్న కలలు సైతం కనకుండా ఈ ప్రపంచం నిరోధిస్తుంటుంది. వీలైతే వారిని ప్రపంచంలో వారిని స్వేచ్ఛగా ఉండనివ్వండి. ఎందుకో.. వారి నవ్వులు చాలా బిగ్గరగా వినబడతాయి. వారి స్వేచ్ఛ విచ్చిలవిడితనంగా కనిపిస్తుంది. మీడియాలో కూడా ఇలానే చూపిస్తున్నారు. వారి దు:ఖం నిజం కాదంటారు. వారి ప్రశ్నలు వారి ఆందోళనలు, వారి ఆశయాలు, వారి బట్టలు అన్ని పరిశీలనకు వస్తాయి. నిజానికి మనకు కవాల్సింది ఇదేనా? ప్రస్తుతం తగ్గిన జీడీపీ, పెరిగిన కరోనా లాంటి అనేక సమస్యల గురించి వాస్తవాలు వెల్లడించడానికి బదులు ఇలాంటి చిన్న చిన్న అంశాలపై సమయం వృధా చేస్తున్నారు''

''గృహహింసకు గురైన అనేక మంది మహిళలకు పోలీసుల్ని ఆశ్రయించే పరిస్థితులు లేవు. ఇలాంటి విషయాలను బహిరంగ పర్చడంలో మీరు చేసిన కృషి ఏంటి? భారతదేశం ఇప్పటికే భయంకరమైన మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మహిళా ఆత్మహత్యల్లో మూడింట ఒక వంతు ఇండియాలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ వదిలేసి రియా ప్రియుడి మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే ఎందుకు తీవ్రంగా పరిగణిస్తున్నారు? రియా పై దుర్మార్గమైన దాడిని ఆపడానికి, మహిళల నైతికతపై కథనాలను నిలువరించడానికి.. వీటన్నినీ ప్రచారం చేస్తున్న వార్తా మాధ్యమాన్ని ప్రశ్నించడానికి మేము ఈ లేఖ రాస్తున్నాము. సరైన, బాధ్యతాయుతమైన పని చేయమని అడగడానికి వ్రాస్తున్నాం. మీరు వార్తల్ని వేటాడండి. మహిళల్ని కాదు'' అని బహిరంగ లేఖతో ప్రముఖులు మీడియా వైఖరిని తప్పుబట్టారు. మరోవైపు బాలీవుడ్‌ లో డ్రగ్స్ వివాదంపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. బాలీవుడ్‌ కు డ్రగ్స్‌కు ఎలాంటి లింకులు లేవని.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో బాలీవుడ్ కు డ్రగ్స్ లింక్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని కేంద్రం స్పష్టం చేసింది.