Begin typing your search above and press return to search.

చిన్న వయసులోనే స్వర్గానికేగారు

By:  Tupaki Desk   |   24 Jun 2015 7:30 PM GMT
చిన్న వయసులోనే స్వర్గానికేగారు
X
సినీవినీలాకాశంలో భవిష్యత్‌ తారలుగా వెలిగిపోవాల్సిన యువతరం నటీనటులు అనూహ్యంగా అకాలమృత్యువు పాలై నింగికెగశారు. అలాంటివారి జాబితాని తిరగేస్తే మనసు కలచివేసే నిజాలెన్నో.

ఇటీవలే ఆర్తి అగర్వాల్‌ (31) అమెరికాలో గుండెపోటుతో మరణించింది. బరువు తగ్గించుకోవడానికి లైపో చేయించుకోవడం వల్ల తలెత్తిన దుష్పరిణామం ఇంతకు దారి తీసిందని ప్రచారమైంది. అలాగే మేటి కథానాయిక దివ్య భారతి (19) మరణం ఇప్పటికీ మిస్టరీనే. ఐదంతస్తుల మేడ పైనుంచి కాలు జారి కింద పడిందని ప్రచారం జరిగింది. లేదు ప్రియుడే తనని పైనుంచి కిందికి తోసేయడంతో మరణించిందన్న వాదన కూడా బలంగా వినిపించింది. రెండు కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేశారు.

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ విజయ్‌(22) ఇటీవలే నేపాల్‌ భూకంపంలో అకాలమృత్యువు పాలయ్యాడు. మృత్యువు ఓ రకంగా అతడిని వెంటాడి బలి తీసుకుంది. అలాగే బాలీవుడ్‌ నటుడు బండిట్‌ క్వీన్‌ ఫేం నిర్మల్‌ పాండే (47) కెరీర్‌లో రాణిస్తున్న టైమ్‌లోనే మరణించాడు.

యువకథానాయిక జియాఖాన్‌ అమితాబ్‌ సరసన 'నిశ్శబ్ధ్‌' చిత్రంలో నటించింది. అతి పిన్న వయసు అంటే 25కే మరణించింది. జియా మరణం కూడా ఓ మిస్టరీనే. ప్రియుడే తన పాలిట మృత్యుపాశం అయ్యాడని చెప్పుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతూనే ఉంది. అలాగే టాలీవుడ్‌ లవర్‌బోయ్‌ ఉదయ్‌ కిరణ్‌ (35) వయసులో మరణించాడు. స్టార్‌ హీరో అవ్వాల్సిన వాడు.. అనూహ్య పరిణామాలు అతడిని కిందికి లాగేశాయి. కారణం ఏదైనా అతడు ఇప్పుడు మన మధ్యన లేడంతే.

హిందీ టీవీ నటుడు సంజిత్‌ బేడీ (34) సైతం చిన్న వయస్సులోనే పరమపదించాడు. బ్రెయిన్‌ రిలేటడ్‌ వ్యాధితో ఈ బుధవారం అతను మృతి చెందాడు. ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ హీరో పాల్‌ వాకర్‌ తన 41వ ఏట ఓ దారుణమైన యాక్సిడెంట్‌లో మరణించాడు.

కారణం ఏదైనా ఇవన్నీ అభిమానుల్ని కలచివేసిన మరణాలు. ఇంకా మనమధ్య ఎక్కడో జీవించే ఉన్నారనుకుంటూనే ఉంటాం.