Begin typing your search above and press return to search.

నార‌య‌ణ్ దాస్ నారంగ్ మృతిపై ప్ర‌ముఖుల సంతాపం

By:  Tupaki Desk   |   19 April 2022 8:30 AM GMT
నార‌య‌ణ్ దాస్ నారంగ్ మృతిపై ప్ర‌ముఖుల సంతాపం
X
తెలుగు ఫిలిమ్ ఛాంబ‌ర్ ఆప్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు, ఏషియ‌న్ గ్రూప్ థియేట‌ర్స్ అధినేత, గ్లోబ‌ల్ సినిమాస్ ఛైర్మ‌న్, నిర్మాత , పంపిణీ దారుడు, ఫైనాన్షియ‌ర్ నారాయ‌ణ్ దాస్ నారంగ్ (78) మంగ‌ళ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా తీవ్ర అస్వ‌స్థ‌త‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఓ ప్ర‌ముఖ హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ లో 'ల‌వ్ స్టోరీ', ల‌క్ష్య వంటి చిత్రాల‌ని అందించారు. ప్ర‌స్తుతం నాగార్జున‌తో 'ఘోస్ట్‌' మూవీతో పాటు ధ‌నుష్ తో ద్విభాష చిత్రాన్ని, శివ కార్తీకేయ‌న్-అనుదీప్ తో ఓ మూవీ, సుధీర్ బాబు - హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ల‌తో ఓ మూవీ నిర్మిస్తున్నారు.

నైజాం ఏరియాలో తొలిత‌రం పంపిణీ దారుల‌లో నారాయ‌ణ దాస్ కె. నారంగ్ ఒక‌రు. ఎగ్జిబిట‌ర్ గా, ఫైనాన్షియ‌ర్ గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సేవ‌లందించారు. ఆయ‌న‌కు సునీల్ నారంగ్‌, భ‌ర‌త్ నారంగ్ అనే ఇద్ద‌రు కుమారులున్నారు. ఈ ఇద్ద‌రిలో సునీల్ నారంగ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నిర్మాత‌గా, ఎగ్జిబిట‌ర్ గా, డిస్ట్రిబ్యూట‌ర్ గా యాక్టీవ్ గా వున్నారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు నారాయ‌ణ దాస్ నారంగ్ చేసిన సేవ‌ల‌ని గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ నుంచి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు, రాజ‌కీయ నేత‌లు ఆయ‌న‌కు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి,నిబద్ధత కలిగిన వ్యక్తి,అపార అనుభవజ్ఞుడు,సినీరంగంలో ఒక మహారథి, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ నారంగ్ గారికి శ్రద్ధాంజలి అని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌క‌టించారు. 'నారాయ‌ణ దాస్ నారంగ్ మ‌ర‌ణ వార్త విని షాక‌య్యాను.

మ‌న చిత్ర ప‌రిశ్ర‌లో వున్న ఒక గొప్ప వ్య‌క్తి ఆయ‌న‌. ఆయ‌న లేక‌పోవ‌డం తీవ్ర దిగ్బ్రాంతిని క‌లిగిస్తోంది. ఆయ‌న‌తో క‌ల‌సి ప‌నిచేయ‌డం ఓ గౌర‌వం. సినిమా ప‌ట్ల ఆయ‌న‌కున్న విజ‌న్‌, అభిరుచి మ‌న‌లో ఎంతో మందికి స్ఫూర్తి. ఆయ‌న కుటుంబానికి బ‌లాన్ని అందించాల‌ని వారికి నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను' అని మ‌హేష్ బాబు అన్నారు.

ప్ర‌ముఖ సినీ పంపిణీదారుడు, ఎగ్జిబిట‌ర్, తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ అధ్య‌క్షులు శ్రీ‌నారాయ‌ణ్ దాస్ నారంగ్ గారి మృతికి చింతిస్తున్నాను. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను న‌టించిన చిత్రాల‌లో కొన్నింటిని వారి సంస్థ ద్వారా రిలీజ్ చేశారు. ఫిల్మ్ ఛాంబ‌ర్ అధ్య‌క్షులుగా సేవ‌లందించారు. ఆయ‌న త‌న‌యుడు సునీల్ నారంగ్ ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుబూతిని తెలియ‌జేస్తున్నాను ' అని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు.

తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి అధ్య‌క్షులు నారాయ‌ణ్ కె. దాస్ నారంగ్ గారు సినీ ఇండ‌స్ట్రీలో అజాత శ‌త్రువుగా పేరు పొందారు. నైజాం లో ఎగ్జిబిట‌ర్, డిస్ట్రీబ్యూట‌ర్ గా సేవ‌లందించారు. వారి మ‌ర‌ణం విచార‌క‌రం. వారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను ' అని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఇదే త‌ర‌హాలో హీరో శివ‌కార్తికేయ‌న్‌, సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మెహెర్ ర‌మేష్ , సుశాంత్ , న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ త‌దితరులు నారాయ‌ణ్ దాస్ కె. నారంగ్ మృతి ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.