Begin typing your search above and press return to search.

#క‌రోనా: నిత్యావ‌స‌రాలు అర్హుల‌కే అందుతున్నాయా?

By:  Tupaki Desk   |   6 April 2020 5:30 AM GMT
#క‌రోనా: నిత్యావ‌స‌రాలు అర్హుల‌కే అందుతున్నాయా?
X
క‌రోనా క్రైసిస్ ప్ర‌పంచాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అన్ని మార్కెట్లు కింద ప‌డ్డాయి. ఇక టాలీవుడ్ పైనా ఈ ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి జీవించే రోజువారీ కూలీల‌పైనా తీవ్రంగా ప‌డింది. తాజా ప‌రిస్థితిని అర్థం చేసుకుని మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) సినీకార్మికుల్ని ఆదుకునేందుకు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. సీసీసీకి ఇప్ప‌టికే తార‌లు స‌హా ప‌లువురు దాత‌ల నుంచి ల‌క్ష‌ల్లో విరాళాలు వెల్లువెత్తాయి. ఇప్ప‌టికే దాదాపు 6కోట్లు పైగా ఫండ్ జ‌మ అయ్యింద‌ని లెక్క‌లు చెబుతున్నాయి. అయితే ఇలా వ‌చ్చిన మొత్తాన్ని ఖ‌ర్చు చేసి కార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అందేలా.. అలాగే ఆర్థికంగా కొంత‌వ‌ర‌కూ స‌హ‌క‌రించేలా క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)- మ‌న‌కోసం క‌మిటీని ఏర్పాటు చేశారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ - ద‌ర్శ‌క‌సంఘం అధ్య‌క్షుడు శంక‌ర్- మెహ‌ర్ ర‌మేష్ త‌దిత‌ర‌ బృందం టీమ్ గా ఏర్ప‌డి కార్మికుల‌కు నిత్యావ‌స‌రాల పంపిణీ కోసం న‌డుం కట్టారు. ముందే ప్ర‌క‌టించిన‌ట్టే ఈ ఆదివారం నుంచి 24 శాఖ‌ల కార్మికుల్లో పేద‌ల‌కు స‌రుకుల్ని పంపిణీ చేస్తున్నారు. తొలిగా ఎన్.శంక‌ర్ చేతుల మీదుగా పంపిణీ మొద‌లైంది.

``సీసీసీ - మ‌న‌కోసం క‌మిటీ ఛైర్మ‌న్ గౌర‌వ‌నీయులు చిరంజీవి గారి సార‌థ్యంలో క‌మిటీ అద్భుత ఆలోచ‌న చేసి సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తి కార్మికుడికి ఇంటికి నెల‌కు స‌రిప‌డా బియ్యం-ప‌ప్పు ఉప్పు గ్రాస‌రీల్ని అందిస్తున్నాం. అందులో భాగంగా స్టూడియోస్ విభాగం కార్పెంట‌ర్ కి స‌రుకులు అందించాం. నేటి నుంచి పంపిణీ కార్య‌క్ర‌మం మొద‌లైంది. నిరంత‌రం సాగే ప్ర‌క్రియ ఇది. ప్ర‌తి కార్మికుడు ధైర్యంగా సీసీసీ మాకు ఆహార‌భ‌ద్ర‌త‌నిస్తుంది అన్న ధైర్యంతో ఉండండి. నెల నెలా మీకు స‌రుకులు ఇంటికే చేర‌తాయి. ఈ కార్య‌క్ర‌మానికి క‌ర్త‌లు అయినా మెగాస్టార్ చిరంజీవి స‌హా దాతలంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను`` అని శంక‌ర్ తెలిపారు.

అయితే ఈ నిత్యావ‌స‌రాల పంపిణీ ఏ ప్రాతిప‌దిక‌న సాగుతోంది? అన్న‌ దానిపై పూర్తి స్ప‌ష్ఠ‌త లేదు ఇప్ప‌టికి. 24 శాఖ‌ల కార్మికులు ర‌క‌ర‌కాల అసోసియేష‌న్ల‌లో మెంబ‌ర్ షిప్ లు క‌లిగి ఉన్నారు. ప్ర‌తి అసోసియేష‌న్ నిత్యావ‌స‌రాల్ని పంపిణీ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారా లేదా? అన్న‌ది తేల‌లేదు. దీనిపై త‌మ్మారెడ్డి- ఎన్.శంక‌ర్ మ‌రింత క్లారిటీ ఇస్తే బావుంటుందేమో!. ఇక ఆల్రెడీ అందుకున్న కార్మికుడిని గుర్తించేందుకు ఏదైనా ట్యాగ్ వేస్తున్నారా? గుర్తించ‌డం ఎలా? అన్న గంద‌ర‌గోళం ఉంది మ‌రి. దీనికోసం లిస్ట్ త‌యారు చేసి ప్ర‌త్యేకించి అసోసియేష‌న్ల ద్వారా అథెంటిగ్గా సాయం చేస్తే బావుంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. అలాగే అసోసియేష‌న్ల‌తో ప‌ని లేకుండా ప‌ని చేసే అసంఘ‌టిత కార్మికుల్ని గుర్తించి వారిని ఆదుకోక‌పోతే ఆక‌లితో న‌క‌న‌క‌లాడే అస‌లు క‌డుపులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వ్వ‌డం ఖాయం.

కృష్ణాన‌గ‌ర్- ఫిలింన‌గ‌ర్ - ఇందిరా న‌గ‌ర్ లో ల‌క్ష‌లాదిగా ఉన్న వారి నుంచి ఇలాంటి వారిని ఎలా గుర్తిస్తారు? అన్న‌ది కూడా స‌మ‌స్యాత్మ‌క‌మే.
స‌రిగ్గా స‌ద్వినియోగం చేస్తే 6 కోట్ల మేర ఫండ్ అంటే త‌క్కువేమీ కాదు. నిజాయితీగా అంద‌రికీ పంపిణీ చేస్తే ఆర్నెళ్ల పాటు నిత్యావ‌స‌రాల‌కు ఆదుకోవ‌డం క‌ష్ట‌మేమీ కాద‌ని విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో . ముఖ్యంగా కోటి మంది నివ‌శించే హైద‌రాబాద్ లో క‌రోనా విజృంభ‌ణ చూస్తుంటే మ‌రో ఆర్నెళ్ల పాటు లాక్ డౌన్ సాగినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇలాంట‌ప్పుడు స‌రుకుల పంపిణీ స‌వ్యంగా చేయ‌క‌పోతే న‌క‌న‌క‌లాడే క‌డుపులు ఇంకా పెరుగుతాయ‌నే అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఈ క్రైసిస్ ని ఎదిరించేందుకు ప‌క‌డ్భందీ వ్యూహాన్ని సీసీసీ అనుస‌రిస్తోందా? అన్న‌ది చూడాలి.