Begin typing your search above and press return to search.

మద్యం బాటిల్‌ తో కొట్టిందనే ఆరోపణలతో హీరోయిన్ పై కేసు నమోదు..!

By:  Tupaki Desk   |   20 May 2021 1:30 AM GMT
మద్యం బాటిల్‌ తో కొట్టిందనే ఆరోపణలతో హీరోయిన్ పై కేసు నమోదు..!
X
'బుజ్జిగాడు' 'సర్ధార్ గబ్బర్ సింగ్' వంటి సినిమాలలో నటించిన హీరోయిన్ సంజన గల్రానీ.. ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమ్మడిపై తాజాగా మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మద్యం బాటిల్‌ తో కొట్టిందనే ఆరోపణలతో బెంగుళూరు కబ్బన్‌ పార్క్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. 2019 డిసెంబరు 24న శాండిల్ వుడ్ ప్రొడ్యూసర్ వందన జైన్‌ ఇచ్చిన ఓ పార్టీకి హీరోయిన్ సంజనా గల్రానీ హాజరయ్యారు. ఈ పార్టీలో వందన - సంజన‌ ల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో సంజన గ‌ల్రానీ ఒక మద్యం బాటిల్‌ తో వందనపై దాడి చేయడంతో చిన్నపాటి గాయమైంది. ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై కబ్బన్‌ పార్క్‌ పోలీసులకు వందన ఫిర్యాదు చేయగా.. సంజనపై కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసు నమోదు చేసి రెండేళ్ళు దాటినా పోలీసులు సంజనాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో నిర్మాత వందన జైన్‌ తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సంజనాపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని అందులో కోరారు. ఈ పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో స్పందించిన కబ్బన్ పోలీసులు సంజనపై కేసు నమోదు చేశారు.

కాగా, కన్నడ సీమలో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ లో అరెస్ట్ కాబడిన సంజన పై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన సంజన, ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చింది. ఆ తర్వాత సీక్రెట్ గా కర్ణాటకకు చెందిన ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలో అడుగుపెట్టింది. ఇప్పుడు మరో కేసు నమోదవడంతో సంజన మళ్ళీ చిక్కుల్లో పడినట్లయింది.