Begin typing your search above and press return to search.

మన్యం వీరుడి జయంతికి 'RRR' పోస్టర్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా..?

By:  Tupaki Desk   |   2 July 2021 7:48 AM GMT
మన్యం వీరుడి జయంతికి RRR పోస్టర్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా..?
X
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం ఇప్పటికే పూర్తి అయింది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని మేకర్స్ వెల్లడించారు. సెట్స్ కూడా రెడీగా ఉండటంతో వీలైనంత త్వరగా పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయాలని జక్కన్న ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ కలిసున్న ఓ పోస్టర్ విడుదల చేయడంతో 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ ప్రమోషన్లను తిరిగి ప్రారంభించింది. ఇంకా అక్టోబర్ 13 విడుదల అంటూ పేర్కొంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ వేగవంతం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూలై 4న ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఆశిస్తున్నారు.

ఎందుకంటే జూలై 4 మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి. అందుకే రామరాజు పాత్రధారి రామ్ చరణ్ కు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మొన్ననే RRR హీరోల పోస్టర్ వదిలారు కాబట్టి, రాజమౌళి ఇంత తక్కువ గ్యాప్ లో మరో కొత్త పోస్టర్ విడుదల చేస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆల్రెడీ రామారావు అవతారంలో చరణ్ లుక్ ని విడుదల చేశారు. సో అదే పోస్టర్ తో అల్లూరిని గుర్తు చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగన్ - అలియా భట్ - సముద్రఖని - ఒలివియా మోరిష్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో RRR మూవీ విడుదల కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా క్లోజ్ అయింది.