Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ ఆ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా..?

By:  Tupaki Desk   |   8 April 2020 4:20 PM IST
రామ్ చరణ్ ఆ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా..?
X
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండటంతో సినీ ఇండస్ట్రీకి చెందిన అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంక డైరెక్టర్ల విషయానికొస్తే ఈ లాక్ డౌన్ సమయాన్ని తమ స్క్రిప్ట్ పనులు కంప్లీట్ చేసుకోడానికి ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా ఫోన్ల ద్వారానే తమ హీరోలను లాక్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ లోని దాదాపు పెద్ద డైరెక్టర్లందరూ తమ నెక్స్ట్ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నారు. కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే వీరు తమ చిత్రాలతో బిజీ కానున్నారు. కానీ ఒక స్టార్ డైరెక్టర్ మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమా ఫైనలైజ్ చేయలేదు. అతనే వంశీ పైడిపల్లి. సూపర్ స్టార్ మహేష్ బాబుకి 'మహర్షి'లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు తన తదుపరి ప్రాజెక్ట్ పట్టాలెక్కించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

వాస్తవానికి వంశీ 'మహర్షి' సినిమా తర్వాత మళ్ళీ మహేష్ తోనే గ్యాంగ్ స్టర్ కథాంశం నేపథ్యంలో సినిమా చేయబోతున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఏమి జరిగిందో తెలియదు గాని, మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ పరశురామ్ ని సంప్రదిస్తున్నట్లు న్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ సినిమా లేనట్లే అర్థం అవుతోంది. దీంతో వంశీ పైడిపల్లి పలువురు అగ్ర హీరోలకు కథలు వినిపించినా ఏదీ ఫైనలైజ్ కాలేదు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వంశీ పైడిపల్లి సినిమా చేయబోతున్నట్లు వార్త బయటకి వచ్చింది. నిజానికి వంశీ పైడిపల్లి 'మహర్షి' సినిమా టైంలోనే ఈ న్యూస్ వచ్చింది. ఇప్పుడు అగ్ర హీరోలైన ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా ఓకే చేసాడు.. అల్లు అర్జున్ సుక్కు సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో చేయనున్నాడు.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కించనున్నాడు... సో కేవలం రామ్ చరణ్ ఒక్కడే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా ఉన్నాడు. దీంతో వీరి కాంబినేషన్ కుదిరే అవకాశాలున్నాయని అందరూ భావిస్తున్నారు. వీరిద్దరూ ఇంతకముందు 'ఎవడు' సినిమా చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్'తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర అనంతరం 'ఆచార్య' మూవీలో ఒక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే.

నిజానికి రామ్ చరణ్ ఏ డైరెక్టర్ తో కూడా రెండో సినిమా చేయలేదు. కానీ 'ఆర్.ఆర్.ఆర్'తో దానికి బ్రేక్ పడనుంది. అందువల్ల వంశీతో చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ వంశీ పైడిపల్లికి అవకాశం ఇస్తాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందుతాడు. తన తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని ఖచ్చితంగా ఆలోచిస్తాడు. మరి ఇలాంటి నేపథ్యంలో రామ్ చరణ్ వంశీకి ఛాన్స్ ఇస్తాడా..?, ఒకవేళ ఛాన్స్ ఇచ్చినా డైరెక్టర్ వంశీ పైడిపల్లి పాన్ ఇండియా రేంజ్ స్క్రిప్ట్ రెడీ చేయగలడా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. మరి వీళ్ళ కాంబోలో రెండో సినిమా కంఫర్మ్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.