Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ లో కెల్విన్‌ కు సభ్య‌త్వం కూడా ఉంద‌ట‌!

By:  Tupaki Desk   |   21 July 2017 12:34 PM IST
టాలీవుడ్‌ లో కెల్విన్‌ కు సభ్య‌త్వం కూడా ఉంద‌ట‌!
X
తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపిన డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి రోజుకో సంచ‌ల‌నం న‌మోద‌వుతోంది. ఓ ముగ్గురు ముఠా స‌భ్యుల డ్ర‌గ్స్ ముఠాను ప‌ట్టుకున్న తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్‌మెంట్ అధికారులు... ఆ ముఠా కీల‌క నిందితుడి మొబైల్ ఫోన్‌ ను స్వాధీనం చేసుకుని అందులోని వివ‌రాలు చూసి షాక‌య్యారు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఆ వివ‌రాల‌ను ఒక్క‌టొక్క‌టిగానే వెల్ల‌డిస్తూ.. ఈ దందాతో చాలా మంది బ‌డా వ్య‌క్తుల‌కు సంబంధాలున్నాయ‌ని అధికారులు ఓ నిర్ధార‌ణ‌కు వచ్చారు. ఈ క్ర‌మంలో తెలంగాణ స‌ర్కారు ఈ దందాను పూర్తి స్థాయిలో విచారించేందుకంటూ ఓ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయ‌గా... కెల్విన్‌ తో సంబంధాల‌ను నెర‌పిన వారిని ఓ వైపు విచారిస్తూనే, మ‌రోవైపు అస‌లు కెల్విన్ టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో ఎలా సంబంధాలు పెంచుకున్నాడ‌న్న కోణంపై దృష్టి సారించారు.

ఈ క్ర‌మంలో ప‌లు షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. డ్ర‌గ్స్‌ కు బానిస‌గా మార‌డ‌మే కాకుండా.. ప‌లువురు ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్స్ అల‌వాటు చేయ‌డంతో పాటు డ్ర‌గ్స్‌ను వారికి స‌ర‌ఫ‌రా చేస్తున్న కెల్విన్‌... త‌న దందాను నిరాఘాటంగా కొన‌సాగించేందుకు ఓ ప‌క్కా ప్లాన్‌ నే ర‌చించుకున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. కెల్విన్ టాలీవుడ్‌ కు బ‌య‌టి వ్య‌క్తి కాద‌ని తేల్చేసిన పోలీసులు... టాలీవుడ్‌లోని జూనియ‌ర్ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ లో స‌భ్యుడ‌ని నిర్ధారించారు. జూనియ‌ర్ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ లో స‌భ్య‌త్వం తీసుకున్న కార‌ణంగానే కెల్విన్‌ కు ప‌లువురు ప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని, ఆ కార‌ణంగానే అత‌డు పెద్ద సంఖ్య‌లో సినీ ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేయ‌గ‌లిగాడ‌ని తేలింద‌ట‌.

జూనియ‌ర్ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ లో స‌భ్యుడిగా కెల్విన్‌ కు సినీ ప‌రిశ్ర‌మ‌తో ప్ర‌త్య‌క్ష సంబంధాలున్న‌ట్లేన‌న్న వాద‌న ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చింది. జూనియ‌ర్ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ లో స‌భ్య‌త్వం తీసుకోవ‌డంతోనే స‌రిపెట్టుకుని కెల్విన్‌... ప‌లు చిత్రాల షూటింగులలో పాలుపంచుకున్నాడ‌ని కూడా తెలుస్తోంది. స‌ద‌రు చిత్రాల షూటింగ్ కోసం చిత్ర యూనిట్ విదేశాల‌కు వెళ్లిన సంద‌ర్భాల్లో ఆ యూనిట్ల‌లో స‌భ్యుడిగా కెల్విన్ కూడా ఫారిన్ టూర్లు జ‌రిపాడ‌ట‌. ఇలా సినిమా యూనిట్ స‌భ్యుడిగా విదేశాల‌కు సులువుగా వెళ్ల‌గ‌లిగిన కెల్విన్‌... ఆయా దేశాల్లో భారీ ఎత్తున డ్ర‌గ్స్ కొనుగోలు చేయ‌డంతో పాటు వాటిని అక్ర‌మ ర‌వాణా ప‌ద్ద‌తుల్లో ఈజీగానే హైద‌రాబాదు తీసుకొచ్చేవాడ‌ని పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డైన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఈ కేసు ద‌ర్యాప్తులో ఇంకెన్ని సంచ‌ల‌నాలు న‌మోద‌వుతాయో చూడాలి.