Begin typing your search above and press return to search.

దండుకున్నోళ్లకు దండుకున్నంత..!

By:  Tupaki Desk   |   27 July 2022 4:30 AM GMT
దండుకున్నోళ్లకు దండుకున్నంత..!
X
బ్యాగ్రౌండ్ & బ్యాంక్ బ్యాలన్స్ ఉండటం వల్ల సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినవారు ఎందరో ఉన్నారు. హీరో మెటీరియల్ కాకపోయినా టాలెంట్ తో సంబంధం లేకుండా.. అనేకమంది నట వారసులు - వ్యాపారవేత్తల పిల్లలు మరియు బడా నిర్మాతల కొడుకులు హీరోలుగా మారడాన్ని మనం చూశాం. ఈ కోవలోనే ఇప్పుడు తన లక్ పరీక్షించుకోడానికి తమిళ బిజినెస్ మ్యాన్ శరవణన్ కూడా బిగ్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇస్తున్నాడు.

లెజెండ్ శరవణన్ గా పిలవబడుతున్న శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నటనపై మక్కువతో తమ వ్యాపార ప్రకటనల్లో హీరోయిన్లతో కలసి నటించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న వ్యక్తి ఆయన. అప్పట్లో హన్సిక మోత్వాని వంటి స్టార్ హీరోయిన్లతో కలిసి యాడ్స్ చేసి బాగా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ''ది లెజెండ్'' అనే సినిమాతో హీరో అవతారమెత్తి సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు.

న్యూ శరవణన్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ పతాకంపై శరవణన్ స్వీయ నిర్మాణంలో 'ది లెజెండ్' సినిమా తెరకెక్కింది. నిర్మాత కూడా తనే కావడంతో భారీ బడ్జెట్ తో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించాడీ బడ్డింగ్ హీరో. స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ ను తన డెబ్యూ సినిమాలో భాగం చేసాడు. స్టార్ హీరోల చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నాడు.

'ది లెజెండ్' చిత్రంలో శరవణన్ సరసన అందాల భామలు ఊర్వశీ రౌతెలా - లక్ష్మీ రాయ్ హీరోయిన్లుగా నటించారు. సుమన్ - ప్రభు - నాజర్ - విజయ్ కుమార్ - లత - కోవైసరళ - యోగిబాబు వంటి పాపులర్ నటీనటులు ఇతర పాత్రలు పోషించారు.

జెడి & జెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు. వేల్ రాజా సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. రాజు సుందరం - బృంద - దినేష్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయగా.. అనిల్ అరసు యాక్షన్ డిజైన్ చేశారు.

లెజెండ్ కాస్టింగ్ మరియు టెక్నిషియన్స్ ని గమనిస్తే.. ఓ స్టార్ హీరో సినిమాని గుర్తు తెస్తుంది. ఏ హీరోకైనా ఇది డ్రీమ్ లాంచ్ అని చెప్పాలి. అయితే దీని కోసం భారీగా ఖర్చు చేసారని తెలుస్తోంది. వారి మార్కెట్ వాల్యూ కంటే అధిక మొత్తంలో చెల్లించి ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చినట్లు టాక్.

ఇక ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ లో తీశారని అర్థం అవుతోంది. తలైవా స్టైల్ నే లెజెండ్ అనుకరించాడు కూడా. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఇస్తున్నట్లు అర్థం అవుతోంది.

సినిమాకి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నాడు. ఆడియో వేడుకకే పది మంది హీరోయిన్లు హాజరవటం విశేషం. లెజెండ్ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా - లక్ష్మీ రాయ్ సహా పూజా హెగ్డే - తమన్నా భాటియా - హన్సిక - శ్రీలీల - శ్రద్ధా శ్రీనాథ్ - డింపుల్ హయతి - యాషికా ఆనంద్ - నూపూర్ సనన్ వంటి ముద్దుగుమ్మలు ఈవెంట్ లో సందడి చేశారు. అలానే తెలుగు ట్రైలర్ లాంచ్ కోసం తమన్నా అతిథిగా హాజరైంది.

తాము నటించిన సినిమాలు ప్రమోషన్స్ కే డుమ్మా కొట్టే హీరోయిన్లు లెజెండ్ ఈవెంట్ కు రావడానికి కారణం.. ప్రతి హీరోయిన్ కు చార్టర్డ్ ఫ్లైట్ టిక్కెట్ తో పాటుగా ఈవెంట్ కు వచ్చినందుకు పారితోషికం కూడా ఇవ్వడమే అనే ప్రచారం జరుగుతోంది.

'ది లెజెండ్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఏ విధంగా డీల్ మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. ప్రతీ భాషలోనూ ప్రముఖ నిర్మాతలే ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటం గమనార్హం.

ప్రమోషన్స్ కోసం లెజెండ్ శరవణన్ తన హీరోయిన్లను వెంటేసుకొని.. చెన్నై తో పాటుగా హైదరాబాద్ - ముంబై - బెంగుళూరు వంటి నగరాలు తిరుగుతున్నాడు. తన సినిమాని దూకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇది స్టార్ హీరోలు కూడా చేయలేని ప్రమోషన్ అని చెప్పాలి. దీని కోసం కూడా లెజెండ్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు టాక్ ఉంది.

శరవణన్ సోషల్ మీడియా మద్యమాలలో అకౌంట్ ఓపెన్ చేస్తేనే అంత హడావిడి చేశారంటేనే ఈ విషయం అర్థం అవుతుంది. 'ది లెజెండ్' కోసం డబ్బును నీళ్లలా కుమ్మరించాడని తెలుస్తోంది. డెబ్యూ మూవీతోనే పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని చేయాలని భావిస్తున్నాడో ఏమో.. ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

లెజెండ్ సినిమా పేరు చెప్పుకుని అందరూ బాగానే క్యాష్ చేసుకుంటున్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. నటీనటులు - టెక్నిషియన్స్ - ఈవెంట్ మేనేజ్మెంట్ - డిజిటల్ టీమ్స్.. ఇలా దండుకున్నోళ్లకు దండుకున్నంత అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టిన ఈ సినిమా లెజెండ్ శరవణన్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. అది తెలియాలంటే ఈ శుక్రవారం వరకూ వేచి చూడాలి. ఎందుకంటే అదే రోజు (జులై 28) 'ది లెజెండ్' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.