Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడికి బుర్రా కౌంటర్

By:  Tupaki Desk   |   20 May 2018 9:35 AM GMT
ఆ దర్శకుడికి బుర్రా కౌంటర్
X
బుర్రా సాయిమాధవ్.. ప్రస్తుతం టాలీవుడ్లో ఈయనే నంబర్ వన్ రచయిత అంటే అతిశయోక్తి లేదు. తొలి సినిమా ‘కృష్ణం వందే జగద్గురుం’తో మొదలుపెడితే.. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’.. ‘కంచె’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’.. ‘ఖైదీ నంబర్ 150’.. ఇలా ప్రతి సినిమాలోనూ తన కలం పదును చూపించారు. మనసుకు హత్తుకునే.. ఆలోచింపజేసే మాటలతో ప్రేక్షకుల మనసులు గెలిచారు. ఇటీవలే ‘మహానటి’తో ఆయన మరో మెట్టు ఎక్కారు. ఓ ఇంటర్వ్యూలో రచయిత అంటే వేల వ్యక్తుల సమూహమని.. అప్పుడే ఏ పాత్రకు ఎలా మాటలు రాయాలో తెలుస్తుందని.. జనాలకు నచ్చే మాటలు రాయగలరని అంటున్న బుర్రా.. ఒక సినిమాకు మాటలు రాయడానికి మైండ్ సెట్ ముఖ్యం తప్ప.. ఏ ప్రదేశంలో మాటలు రాస్తున్నామన్నది ప్రధానం కాదని అన్నారు.

సాధారణంగా సినిమా స్క్రిప్టు సిట్టింగ్స్ కోసం రచయితలు పెద్ద పెద్ద హోటళ్లలో గదులు అద్దెకు తీసుకుంటారు. లేదంటే ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లి అక్కడ సిట్టింగ్ వేస్తారు. కొందరు విదేశాలకు కూడా వెళ్తారు. కానీ తనకు మాత్రం ఇలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఏమీ అవసరం లేదని అన్నారు సాయిమాధవ్. తాను ఎక్కడ కూర్చుంటే అక్కడే మాటలు రచన చేస్తానని.. ప్రదేశంతో తనకు సంబంధం లేదని అన్నారాయన. ‘‘డైలాగులు రాయడానికి కొందరు గోవా వెళ్తారు. ఇంకొందరు బ్యాంకాక్ వెళ్తారు. నేను ఎక్కడ కూర్చుంటే అదే నా ఆఫీస్. కూర్చున్న స్థలం విశాలంగా ఉంటే సరిపోదు. ఆలోచనలు అంతే విశాలంగా ఉండాలి. ఇరుకు గదుల్లో రాసినంత మాత్రాన భావాలు పలకవా? కథలో.. సన్నివేశాల్లో ఆర్ద్రత కనిపిస్తే ఎక్కడైనా భావాలు పలుకుతాయి’’ అని కుండబద్దలు కొట్టారు సాయిమాధవ్. యాదృచ్ఛికంగా అన్నా సరే సాయిమాధవ్ మాటల్లో ‘బ్యాంకాక్’ అనే మాట రాగానే అందరికీ ఒక డాషింగ్ డైరెక్టర గుర్తుకు రాకుండా పోరు.