Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బయోపిక్ పోయిందనే బాధ జీవితాంతం ఉంటుంది!

By:  Tupaki Desk   |   10 Jan 2022 9:30 AM GMT
ఎన్టీఆర్ బయోపిక్ పోయిందనే బాధ జీవితాంతం ఉంటుంది!
X
పరుచూరి బ్రదర్స్ .. పోసాని తరువాత ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాయిమాధవ్ బుర్రా. డైలాగ్ రైటర్ గా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఎక్కడ .. ఏ సందర్భంలో .. ఎలాంటి డైలాగ్ వేయాలనేది ఆయనకి బాగా తెలుసు. అందువల్లనే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. "నేను పుట్టి పెరిగింది తెనాలిలో. మా అమ్మా నాన్నలు స్టేజ్ ఆర్టిస్టులు .. నేను కూడా హై స్కూల్ రోజల నుంచే నాటకాలు వేసేవాడిని.

నాటకాలపై నాకున్న ఆసక్తి సినిమాల వైపుకు మళ్లింది. సినిమాలకి రైటర్ గా పనిచేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చాను. ఇంటి దగ్గర నుంచి నెలకి వేయి రూపాయలు వచ్చేవి. వాటితోనే సరిపెట్టుకునేవాడిని. ఆకలితోనే పడుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయంలో కూడా ఫలానా సినిమాలో కమల్ హాసన్ ఆకలితో పస్తులున్నాడు .. ఆ అవకాశం ఇప్పుడు నాకు దొరికిందని అనుకునేవాడిని. అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నాలు చేసేవాడిని కాదు. నా దగ్గరికి వచ్చిన సీరియల్స్ కి రాయడం మొదలుపెట్టాను.

అలా నేను 'పుత్తడిబొమ్మ' సీరియల్ కి రాశాను .. అది చూసిన క్రిష్ గారు నాకు 'కృష్ణం వందే జగద్గురుమ్' సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన సినిమాలకు వరుసగా రాస్తూ వస్తున్నాను. నాకు ఎన్టీరామారావుగారంటే చాలా ఇష్టం. అలాంటి ఆయన బయోపిక్ రాసే అవకాశం లభించడం నా అదృష్టం అనుకున్నాను. ఆ సినిమా నా చేతికి వచ్చినందుకు చాలా గర్వపడ్డాను. కానీ ఆ సినిమా పోయిందనే బాధ జీవితాంతం ఉంటుంది. ఇక చిరంజీవి గారు స్వయంగా నాకు కాల్ చేసి తన 150వ సినిమాకి రాయమని అడగడం నేను ఎప్పటికీ మరిచిపోలేను.

'బాహుబలి' సినిమాకి నన్ను రాయమని అడిగారు .. అన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగిపోయింది. కానీ ఎందుకనో ఆ తరువాత వాళ్ల నుంచి కాల్ రాలేదు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి మాత్రం రాజమౌళి పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఇంత పెద్ద సినిమాలో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాస్తూ ఉండటమే నా పని .. నా ప్రయాణం. నేను రాసిన వాటిల్లో బాగా పేలతాయనుకున్న డైలాగులను ప్రేక్షకులు ఎంతమాత్రం పట్టించుకోని సందర్భాలు కూడా ఉన్నాయి. నేను మందు .. టీలు కూడా మానేశాను. మా గురువుగారు సిరివెన్నెలగారికి నివాళిగా సిగరెట్లు కూడా మానేశాను" అంటూ చెప్పుకొచ్చాడు.