Begin typing your search above and press return to search.

కథ నచ్చింది.. ఫ్లాట్ తాళాలు ఇచ్చేశాడు

By:  Tupaki Desk   |   20 Aug 2018 1:30 AM GMT
కథ నచ్చింది.. ఫ్లాట్ తాళాలు ఇచ్చేశాడు
X
‘గీత గోవిందం’ సాధిస్తున్న వసూళ్లతో గాల్లో తేలిపోతున్నాడు ఈ చిత్ర నిర్మాత బన్నీ వాసు. ‘గీతా ఆర్ట్స్-2’ బేనర్లో బన్నీ వాసు ఇప్పటికే చాలా సినిమాలు నిర్మించాడు. మంచి విజయాలందుకున్నాడు. వాటిని మించిన భారీ విజయం ‘గీత గోవిందం’ సాధించింది. ఒక పెద్ద హీరో సినిమా స్థాయిలో ఇది ఓపెనింగ్స్ సాధించింది. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి.. భారీ లాభాల దిశగా దూసుకెళ్తోంది. విడుదలకు ముందు పైరసీ ఉదంతంతో పది రోజుల పాటు ఉక్కిరి బిక్కిరి అయిన తనకు ఈ విజయం ఎంతో ఉపశమనాన్ని అందిస్తోందని బన్నీ వాసు అంటున్నాడు. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తాయని తెలుసు కానీ.. మరీ ఈ స్థాయిలో ఉంటాయని ఊహించలేదన్నాడు.

‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ తోనే మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన బన్నీ వాసు.. ‘గీతా ఆర్ట్స్’ బేనర్లో ఒక దర్శకుడు వరుసగా మూడు చిత్రాలు చేస్తుండటం ఇదే తొలిసారని.. ఇది పరశురామ్‌ కు మాత్రమే దక్కిన గౌరవమని అన్నాడు. ఇప్పుడున్న స్థితిలో పరశురామ్ తనను విడిచి ఎక్కడికీ వెళ్లడన్నాడు. ‘గీత గోవిందం’తో పాటు ఏడాదిన్నర కిందటే పరశురామ్ చెప్పిన మరో కథ కూడా నచ్చిందని.. ఆ కథతోనే తమ కాంబినేషన్లో తర్వాతి సినిమా ఉంటుందని చెప్పాడు. పరశురామ్ చెప్పిన రెండో కథ తనకు విపరీతంగా నచ్చేయడంతో.. అప్పటికే తాను కొన్న కొత్త ఫ్లాట్ తాళాల్ని అడ్వాన్స్ రూపంలో మరుసటి రోజే అతడి చేతిలో పెట్టేసినట్లు బన్నీ వాసు వెల్లడించాడు. ఈసారి ‘గీత గోవిందం’ను మించిన విజయాన్నందుకునేలా కష్టపడి పని చేస్తామని అతను చెప్పాడు.